Taliban: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మలుగా మారారు. ఆఫ్ఘన్‌లో తాలిబన్లు తాము చెప్పినట్టు నడుచుకునేవిధంగా పాక్ ఐఎస్‌ఐ ట్రయినింగ్ ఇస్తోంది. ఐఎస్‌ఐ చీఫ్ జనరల్ ఫయీజ్ హమీద్ అకస్మాత్తుగా కాబూల్‌లో పర్యటించారు. ప్రభుత్వ ఏర్పాటుతో పాటు పంజ్‌షేర్ వ్యాలీలో యుద్దాన్ని సమీక్షించేందుకు కాబూల్‌కు వచ్చారు ఫయీజ్ అహ్మద్. ఆఫ్ఘనిస్తాన్‌లో పంజ్‌షేర్ లోయ మినహా మిగతా ప్రాంతమంతా తాలిబన్ల కబ్జాలో ఉంది. అంతేకాదు, పంజ్‌షేర్ వ్యాలీలో తాలిబన్లకు పాకిస్తాన్ అన్నివిధాలా సాయం చేస్తోంది. అల్‌ఖైదా ఉగ్రవాదులతో పాటు పాక్ సైనికులు కూడా తాలిబన్ల తరపున పోరాటం చేస్తునట్టు తెలుస్తోంది.
అయితే పంజ్‌షేర్ వ్యాలీపై పట్టు తమదంటే తమదని అటు తాలిబన్లు, ఇటు నార్తర్న్ అలయెన్స్ బలగాలు ప్రకటించుకుంటున్నాయి. పాక్ సైన్యం తాలిబన్లకు సాయం చేసిననప్పటికి వాళ్ల దాడులను నార్తర్న్ అలయెన్స్ బలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి. తాజాగా తాలిబన్ల యుద్ద ట్యాంకులను నార్తర్న్ అలయెన్స్ బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పంజ్‌షేర్ వ్యాలీని కాపాడుకుంటామని నార్తర్న్ అలయెన్స్ బలగాలంటున్నాయి.
మరోవైపు, తాలిబన్ల ప్రభుత్వంలో ఎవరు ఏ పదవి చేపట్టాలన్న విషయంపై కూడా నిర్ణయించేది పాక్ ఐఎస్‌ఐ అని ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం జరుగుతున్నట్టు చెబుతున్నారు. పంజ్‌షీర్ లోయలో తాలిబన్లు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సమయంలో జనరల్ ఫయీజ్ కాబూల్‌లో పర్యటిస్తున్నారు. మరోవైపు తాలిబన్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ మహిళలు కదం తొక్కుతున్నారు. చస్తాం కాని మీ పాలన వద్దంటూ ఆఫ్ఘన్‌లో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే కాబూల్‌లో ఆందోళన చేస్తున్న మహిళలపై తాలిబన్లు రాక్షసత్వంగా ప్రవర్తించారు. భాష్పవాయువును ప్రదర్శించారు. అంతేకాదు ఏకే47 తుపాకులతో మహిళలను చితకబాదారు.
ఆందోళన చేస్తున్న మహిళలు వెనక్కి వెళ్లిపోవాలని తాలిబన్ నేతలు హెచ్చరించారు. అయితే వాళ్ల బెదిరింపులకు డేర్ డెవిల్ లేడీస్ భయపడలేదు. తాలిబన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తాలిబన్ లీడర్ చేతి నుంచి మైక్ లాక్కొని వాళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారంలో మహిళను భాగస్వాములను చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న తాలిబన్లు ఆచరణలో మాత్రం పాత పద్దతులనే వాడుతున్నారు. తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాడ్డాక మహిళల పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుందని మాననహక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి.