Telugu People Stranded In Afghan: ఆఫ్ఘనిస్థాన్ భూభాగాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న అనంతరం ఆ ప్రాంతంలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎటుచూసినా ప్రజల హాహాకారాలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజలు, వీదేశీయులు ఆఫ్ఘన్ నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తెలుగువారు సైతం ఆఫ్ఘన్‌లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. విమాన టికెట్లు సిద్ధమై, మరికొద్ది రోజుల్లోనే తిరిగివస్తారనుకున్న వారు అనూహ్యంగా అఫ్ఘానిస్థాన్‌లో చిక్కుకుపోవటంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. వారి క్షేమంగా ఇంటికి చేర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌కు చెందిన బొమ్మన రాజన్న.. ఎనిమిదేళ్లుగా అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్‌లో ఏసీసీఎల్ సంస్థలో పనిచేస్తున్నారు. గత జూన్ 28న అక్కడి నుంచి స్వస్థలానికి తిరిగివచ్చి.. మళ్లీ ఈనెల ఏడో తేదీనే అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆప్ఘన్‌ను తాలిబాన్ల వశపరుచుకున్నారు. అయితే.. అక్కడినుంచి బయటపడేందుకు దారులన్నీ మూసుకుపోయాయని ఆయన వాపోయారు. ప్రస్తుతం తనతో పాటు తన కంపెనీలో పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా ఒడ్డారానికి చెందిన పెంచెల వెంకటయ్య కూడా ఉన్నారని టీవీ9తో పేర్కొన్నారు. అంతేకాకుండా.. మరో 14 మంది భారతీయులు ఉన్నారని పేర్కొన్నారు.
ఈ నెల 18న ఇండియాకు వచ్చేందుకు తమ సంస్థ టికెట్లు సిద్ధం చేసినా విమానాలు.. అందుబాటులో లేవని రాజన్న తెలిపారు. తాలిబాన్ల వల్ల ఎయిర్‌పోర్టుకు చేరుకోలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. తనని సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని పేర్కొంటున్నారు.
అయితే.. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న తమ తమ ఇంటిపెద్దను క్షేమంగా ఇంటికి చేర్చాలని రాజన్న.. కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆయన ప్రమాదంలో ఉన్నారని ప్రభుత్వం చొరవ తీసుకుని ఇంటికి చేర్చాలని భార్య వసంత, కుమార్తె రమ్య ప్రాథేయపడుతున్నారు.
Also Read: