Afghan Women Protest: తాలిబన్లకు వ్యతిరేకంగా మరోసారి గళమెత్తింది ఆఫ్ఘన్ మహిళ. బహిరంగ ప్రదేశాల్లో మొహాలను దాచుకోవాలంటూ జారీ చేసిన ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రదర్శనకు దిగారు. మహిళల విషయంలో తమ వైఖరి ఏమాత్రం మారలేదని మరోసారి చాటుకున్నారు తాలిబన్లు. బహిరంగ ప్రదేశాల్లో శరీరంతో పాటు మొహం కనిపించకుండా వస్త్రాలంకరణ చేసుకోవాలని కొత్త ఆర్డర్ పాస్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ చీఫ్, తాలిబన్ల నేత హిబతుల్లా అఖుంద్జాదా.. పూర్తిగా ఆదర్శవంతమైన సాంప్రదాయ బురఖాను ధరించాలని మహిళలను ఆదేశాలను జారీ చేశారాయన.. అత్యవసరం అయితే తప్ప మహిళలు వీధుల్లోకి రావద్దని, ఇంట్లోనే ఉండాలని సూచించారు అఖుంద్జాదా.. ఈ కొత్త ఆదేశాలపై తీవ్రంగా మండిపడుతోంది ఆఫ్ఘనిస్తాన్ మహిళా సమాజం.
రాజధాని కాబూల్‌లో బురఖా నిబంధనను నిరసిస్తూ ఆందోళనకు దిగారు కొందరు మహిళలు. వీరంతా బురఖా ధరించినా తమ ముఖాలను బహిరంగానే ప్రదర్శించారు.. ఈ బురఖా మా హిజాబ్ కాదు, మాకు న్యాయం కావాలి అంటూ నినాదాలు చేశారు.. తాము జంతువులం కాదు, మనుషులం అని తాలిబన్ పాలకులు గుర్తుంచుకోవాలని ఈ ర్యాలీకి నాయకత్వం వహించిన సైనా సమా అలిమ్యాన్ అన్నారు.. కాగా ఈ ఊరేగింపు కొద్ది దూరంవెళ్లగానే అడ్డుకున్నారు తాలిబన్లు.. ఈ ర్యాలీని కవర్ చేయకుండా జర్నలిస్టులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు..
మరోవైపు కొత్త డ్రెస్ కోడ్‌ను పాటించని మహిళా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని ఆదేశించారు అఖుంద్జాదా.. వారి భర్తలు, తండ్రులను కూడా సస్పెండ్ చేయాలని సూచించారు.