No Foreign Guest : 2021 గణతంత్ర వేడుకలకు ముఖ్య విదేశీ అతిధిగా హాజరుకావడానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రావడానికి అంగీకరించారు. అయితే మళ్ళీ ఆ దేశంలో కోవిడ్ విజృంభిస్తుండడంతో పర్యటన వాయిదా వేసుకున్నారు. దీంతో ఈ ఏడాది విదేశీ అతిధి లేకుండా రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహిస్తున్నారు. విదేశీ అతిథి లేకుండానే భారత్ రిపబ్లిక్ వేడుకలు నిర్వహించడం ఇది నాలుగోసారి మాత్రమే. 1952, 1953 మరియు 1966లలో విదేశీ అతిథి హాజరు కాలేదు. కరోనా ఆంక్షల ప్రభావంతో ఈసారి ముఖ్య అతిథి లేకుండానే గణతంత్ర వేడుకలు జరగనున్నాయి.
భారత దేశం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం సంపాదించిన తర్వాత 1950 జనవరి 26 న సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఆరోజున భారత్‌లో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకల్ని నిర్వహించారు. ఆ వేడుకలకు ఇండోనేసియా అధ్యక్షుడు సుకర్నో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మూడు మినహా ప్రతి ఏడాది విదేశీ అతిథి ఈ వేడుకలకు హాజరయ్యారు. ముఖ్యంగా 2018 రిపబ్లిక్ డే వేడుకలు భారత చరిత్రలో మరచిపోలేనివి. ఆ ఏడాది ఎన్నడూ లేని రీతిలో పది మంది ఆసియా దేశాధినేతలు గణతంత్ర వేడుకల అతిథులుగా హాజరయ్యారు.
ఆగ్నేయాసియా దేశాల కూటమి.. (అసోసియేషన్ ఆఫ్ సౌత్-ఈస్ట్ ఏసియన్ నేషన్స్)-భారత్ మైత్రీబంధం రజతోత్సవాలను పురస్కరించుకొని ఆసియాన్‌లోని మొత్తం పది సభ్యదేశాలను గణతంత్ర దినోత్సవానికి భారత్ ఆహ్వానించింది. ఇలా రిపబ్లిక్ డే వేడుకలకు ఏటా ఎవరో ఒక విదేశీ అతిధిని పిలవడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా చేయడానికి ఒక కారణం ఉంది.. విదేశీ అతిధులరాకతో మన దేశ సంస్కృతి సంప్రదాయాల గొప్పదనం వారికి తెలియజేయడమే కాదు.. దౌత్య సంబంధాలను మెరుగు పరచుకోవడం దీని ముఖ్య ఉద్దేశ్యం. అయితే ప్రపంచ దేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది విదేశీ అతిధి లేకుండానే రిపబ్లిక్ డే వేడుకలు జరగబోతున్నాయి.
Also Read: 30 ఏళ్ల తర్వాత కలిసిన రఘుపతి.. రాఘవ.. రాజా రామ్‌ల ఫోటో సోషల్ మీడియాలో హల్ హల్