Gas Line Likely: అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కారణంగా గ్యాస్ లీకేజీ కారణంగా పేలుడు సంభవించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌లో జరిగిన పేలుడు ఘటనలో ఏడుగురు మృతి చెందారు. గ్యాస్ పైప్‌లైన్ పేలుడు కారణంగా మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా, 50 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ పేలుడు ధాటికి బస్సుల కిటికీలు దెబ్బతిన్నాయి. ఈ పేలుడు ఘటన విషయాన్ని ఢాకా పోలీసు చీఫ్ షఫీకుర్ రెహ్మాన్ తెలిపారు. గ్యాస్ పైపులైన్ లో మీథేన్ వాయువు పేరుకుపోయి పేలుడు సంభవించిందని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసు జాయింట్ కమిషనర్ సయ్యద్ నూరుల్ ఇస్లాం వివరించారు. పేలుడు సంభవించిన భవనంలో రెస్టారెంట్, ఎలక్ట్రానిక్స్ షాపులున్నాయి. దీని పక్కనే ఉన్న మరో రెండు భవనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయని, గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను షేక్ హసీనా బర్న్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.