
మలేషియాలో ఇప్పుడు ఫ్లూ భయం పట్టుకుంది. ఏకంగా 6,000 మంది విద్యార్థులకు ఇన్ఫ్లుఎంజా జబ్బు రావడంతో చాలా స్కూళ్లను మూసేశారు. ముఖ్యంగా పరీక్షలకు కొద్ది రోజుల ముందు ఇలా జరగడం పేరెంట్స్‌ను, విద్యార్థులను ఆందోళనలోకి నెట్టింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 97 ఇన్ఫ్లుఎంజా క్లస్టర్‌లను గుర్తించింది. గత వారం కేవలం 14 క్లస్టర్‌లు మాత్రమే ఉండగా ఈ పెరుగుదల వేగంగా ఉంది. సోకిన వారిలో ఎక్కువ మంది స్కూల్, కిండర్ గార్టెన్‌లకు చెందిన విద్యార్థులే.
మలేషియాలోని సెలాంగోర్ వంటి అనేక ప్రాంతాలలో విద్యార్థులు జ్వరం, గొంతు నొప్పి, అలసట వంటి ఇన్ఫ్లుఎంజా A, B లక్షణాలతో బాధపడుతున్నారు. వ్యాప్తి వేగంగా ఉండటంతో స్థానిక ఆరోగ్య అధికారులు వెంటనే పాఠశాలలను మూసివేయాలని, సోకిన విద్యార్థులు ఐదు నుంచి ఏడు రోజులు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఆరోగ్య బృందాలు శానిటైజేషన్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి. పాత కోవిడ్ రోజుల్లోలాగే, గుంపుగా చేరవద్దని, మాస్కులు పెట్టుకోవాలని గుర్తు చేస్తున్నారు.
నవంబర్ మొదటి వారంలో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్షలు రాయాల్సి ఉంది. ఈ సమయంలో ఫ్లూ వ్యాప్తి పెరగడం వల్ల అధికారులు ఆరోగ్యాన్ని, పరీక్షలను ఎలా సమన్వయం చేయాలో ఆలోచిస్తున్నారు. సంక్షోభం కొనసాగితే పరీక్షలలో అంతరాయాలు కలగకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఫ్లూతో పాటు, మలేషియా శాస్త్రవేత్తలను కొత్త కోవిడ్-19 వేరియంట్ XFG కూడా కలవరపెడుతోంది. ఇది గతంలో భారతదేశంలో మొదలైంది. ఈ XFG వేరియంట్ చాలా వేగంగా వ్యాపించేదిగా ఉంది. మలేషియాలో మొత్తం కోవిడ్ కేసుల్లో ఇప్పుడు 8శాతం కంటే ఎక్కువ కేసులు ఈ XFG వేరియంట్‌వే ఉన్నాయి.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ మొహమ్మద్ అజామ్ అహ్మద్ మాట్లాడుతూ.. పుట్టొస్తున్న వేరియంట్‌లను ట్రాక్ చేయడానికి, సాధ్యమయ్యే కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ను అరికట్టడానికి జన్యు నిఘాను పెంచినట్లు తెలిపారు. సరైన వెంటిలేషన్, శుభ్రత పాటిస్తేనే ఈ రెండు వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. గత సంవత్సరంతో పోలిస్తే కోవిడ్ – 19 కేసులు 50శాతం తగ్గినప్పటికీ ఆరోగ్య సంస్థలు ఎటువంటి రిస్క్ తీసుకోవడం లేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..