Singapore Hang Mentally Handicapped Man: ఉరిశిక్ష పడిన వ్యక్తి కోసం మానవ హక్కుల సంఘాలు నడుంకట్టాయి. క్షమాభిక్ష పెట్టాలంటూ ఉద్యమిస్తున్నాయి. కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ వేదికగా మద్దతు కూడగడుతున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఉరిశిక్ష పడిన ఓ భారత సంతతి వ్యక్తి కోసం సింగపూర్‌లో ఆన్‌లైన్ వేదికగా భారీ ఉద్యమం నడుస్తోంది. అతడికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆన్లైన్వేదికగా మానవ హక్కుల సంఘాలు భారీ ఎత్తున సంతకాలు సేకరిస్తున్నాయి. అక్టోబర్ 29న ఆన్‌లైన్ వేదికగా 50వేల సంతకాల సేకరణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు దాదాపు 40 వేల సంతకాలను కూడగట్టాయి.
మలేషియాకు చెందిన నాగేంద్రన్ కె ధర్మలింగం అనే భారత సంతతి వ్యక్తి 2009లో సింగపూర్‌లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఆ సమయంలో అతని వద్ద 42.72 గ్రాముల హెరాయిన్ దొరికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అభియోగంపై 2010లో సింగపూర్ కోర్టు దోషిగా తేలింది. దీంతో నాగేంద్రన్‌కు ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో నవంబరు 10న నాగేంద్రన్‌కు మరణశిక్షను అమలు చేయనున్నట్లు అక్కడి మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆందోళన చెందిన మానవ హక్కుల సంఘాలు.. నాగేంద్రన్‌కు క్షమాభిక్ష పెట్టాలంటూ సింగపూర్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. మానసిక వికలాంగుడైన (హైపర్ యాక్టివిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం) నాగేంద్రన్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ సింగపూర్ అధ్యక్షుడు హలీమా యాకోబ్‌కు అభ్యర్థనలు పంపుతున్నాయి.
ఇందుకోసం అక్టోబర్ 29న మానవ హక్కుల సంఘాలు ఆన్‌లైన్ వేదికగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. 50వేల సంతకాల సేకరణే లక్ష్యంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో గురువారం నాటికి 39,962 సంతకాలను సేకరించాయి. మానసిక వికలాంగుడైన వ్యక్తికి మరణశిక్ష విధించొద్దంటూ మానవ హక్కుల సంఘాల కార్యకర్తలు విన్నవిస్తున్నారు. అంతేగాక తన ప్రేయసిని హత్య చేస్తామని బెదిరించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నాగేంద్రన్‌తో బలవంతంగా డ్రగ్స్ అక్రమ రవాణా చేయించారని వారు పేర్కొంటున్నారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే డ్రగ్స్ తీసుకున్నాడని చెబుతున్నారు. ఆ తర్వాత మానిసిక రోగిగా మారిన నాంగ్రేంద్రన్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని సంతకాలు సేకరిస్తున్నారు. ఈమేరకు తమ పిటిషన్ ద్వారా సింగపూర్ కోర్టు సైతం వారు అభ్యర్థిస్తున్నారు.
అయితే, 2010లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో దోషిగా తేలిన నాగేంద్రన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, చేసిన అప్పులు తీర్చేందుకు పూర్తి అవగాహనతోనే అతడు ఈ తప్పు చేసినట్లు హైకోర్టుతో పాటు అప్పీల్ కోర్టు సమర్థించినట్లు సింగపూర్ హోం మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. అతనితో బలవంతంగా ఈ పని చేయించారనే వాదనలను తోసిపుచ్చింది. అటు క్షమాభిక్ష కోసం నాగేంద్రన్ అధ్యక్షునికి పెట్టుకున్న అర్జీ కూడా తిరస్కరణకు గురైందని మలేషియా హోం మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. నాగేంద్రన్ ఫ్యామిలీ మలేసియా నుంచి సింగపూర్‌కు వచ్చేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. దీనిబట్టి చూస్తే నాగేంద్రన్‌కు నవంబర్ 10న ఉరిశిక్ష అమలు చేసే ఉద్దేశంతోనే సింగపూర్ సర్కార్ ఈ ఏర్పాట్లు చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Also… Cryptocurrency Cheating: బెంగాల్ కేంద్రంగా క్రిప్టోకరెన్సీ పేరుతో మోసాలు.. నలుగురు నిందితుల అరెస్ట్!