ఒక ‘పిల్లి’.. ఆ నగరాన్నే కదిలించింది..
శాన్ ఫ్రాన్సిస్కోలో వేమో రోబో ట్యాక్సీ ఢీకొని "16వ వీధి మేయర్" కిట్ క్యాట్ పిల్లి మృతి చెందడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన డ్రైవర్‌లెస్ కార్ల భద్రత, జవాబుదారీతనంపై ప్రశ్నలు లేవనెత్తింది. స్థానికులు స్మారక కేంద్రం ఏర్పాటు చేసి, స్వయంప్రతిపత్త వాహనాల నియంత్రణ అధికారాన్ని స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అమెరికాలో ఓ పెంపుడు పిల్లి కోసం ఊరు ఊరంతా కదిలింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని మిషన్ డిస్ట్రిక్ట్ 16వ వీధిలో ఉండే కిట్ క్యాట్ పిల్లికి ఆ ప్రాంతంలో మంచి పేరుంది. అందరితో స్నేహంగా ఉండటంతో స్థానికులు దాన్ని ముద్దుగా ’16వ వీధి మేయర్’ అని పిలుచుకున్నారు. అక్టోబర్ 27వ తేదీ అర్ధరాత్రి ‘కిట్ క్యాట్’ పిల్లిని రోబో ట్యాక్సీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం పెద్ద దుమారానికి దారితీసింది. ఆ పిల్లి మరణంతో చలించిపోయిన స్థానికులు, అది చనిపోయిన ప్రదేశంలో ఒక స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ వేమో సంస్థను విమర్శిస్తూ ప్లకార్డులు పెట్టారు. అదే సమయంలో, “మనిషి నడిపే కార్ల వల్ల ఏటా వందల జంతువులు చనిపోతున్నాయి” అనే వాస్తవాన్ని గుర్తు చేస్తూ ఇంకొందరు బోర్డులు ఉంచారు. గూగుల్ సంస్థ అయిన వేమోకు చెందిన సెల్ఫ్ డ్రైవింగ్ కారు ఢీకొట్టడంతో డ్రైవర్‌లెస్ వాహనాల భద్రతపై చర్చ మొదలైంది. ఈ వాహనాల విషయంలో స్థానిక ప్రభుత్వాలకు కూడా అధికారం ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపించింది. ఈ ఘటన రాజకీయంగా కూడా సంచలనమైంది. మిషన్ డిస్ట్రిక్ట్ సూపర్‌వైజర్ జాకీ ఫీల్డర్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. “మనిషి డ్రైవ్ చేస్తూ ప్రమాదం చేస్తే, వారిని బాధ్యులను చేయవచ్చు. పోలీసులు వారిని పట్టుకునే అవకాశం ఉంది. కానీ, రోబో ట్యాక్సీ విషయంలో ఎవరిని బాధ్యులను చేయాలి? జవాబుదారీతనం ఎవరిది?” అంటూ ఆమె ప్రశ్నించారు. డ్రైవర్‌లెస్ కార్లను తమ ప్రాంతాల్లో అనుమతించాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించుకునే అధికారాన్ని స్థానిక ఓటర్లకు ఇవ్వాలని ఆమె తన తీర్మానంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాలిఫోర్నియాలో ఈ వాహనాల నియంత్రణ అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండగా, స్థానిక అధికారులకు పరిమిత అధికారాలే ఉన్నాయి. ఈ ఘటనపై వేమో సంస్థ స్పందించింది. తమ వాహనం బయలుదేరుతున్న సమయంలో పిల్లి సడెన్‌గా దాని కిందకు దూసుకొచ్చిందని, పిల్లి యజమానికి, స్థానికులకు సానుభూతిని ప్రకటించింది. దాన్ని ప్రేమించిన వారందరి బాధను తాము అర్థం చేసుకోగలమనీ భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని కంపెనీ చెప్పింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

