Viral: 26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..

Viral: 26 ఏళ్ల క్రితం హత్య… హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..

Anil kumar poka

|

Updated on: Dec 01, 2024 | 12:38 PM

భార్యపై అనుమానంతో కన్నబిడ్డ అని కూడా చూడకుండా ఆరు నెలల పసికందును గొంతు నులిమి కన్న తండ్రే అమానుషంగా చంపేశాడు. పసిబిడ్డ డెడ్ బాడీని ఓ చోట పాతి పెట్టి పరారయ్యాడు. కర్ణాటకలోని ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లి.... పేరు మార్చుకుని... ఓ రైతు దగ్గర తోటలో పనికి చేరాడు. అక్కడే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కుమార్తెలు జన్మించారు. ఇలా 26 ఏళ్లు గడిచిపోయాయి.

అంతా మరిచిపోయారు అనుకున్నాడు. తనకి ఏం కాదులే అనుకున్నాడు. ఈ క్రమంలో తన రెండో భార్య చిన్న కూతురు వివాహానికి తన చిన్ననాటి మిత్రుడిని ఆహ్వానించాడు. తన చిన్న కూతురు వివాహానికి రావాలంటూ పెండ్లి పత్రిక కూడా పంపించాడు. అక్కడే దొరికిపోయాడు. ఆ పెళ్లి పత్రికను పట్టుకుని పోలీసులు కూపీ లాగారు. మాటు వేసి నిందితుడిని పట్టుకుని.. 26 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం దిన్నేహట్టిలో 26 సంవత్సరాల క్రితం కుమారుడిని హత్య చేసి పరారైన తిప్పేస్వామి అలియాస్ కృష్ణ గౌడను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తిప్పే స్వామి, కరియమ్మ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమారులు. భార్య కరియమ్మపై అనుమానంతో తిప్పేస్వామి చిన్న కుమారుడు శివలింగయ్య తనకు పుట్టలేదని భావించి 1998 అక్టోబర్ రెండవ తేదీన దిన్నేహట్టి గ్రామ శివారు పొలాల్లో కుమారుడిని గొంతు నులిమి హత్య చేసి.. అక్కడే గొయ్యి తీసి.. పాతిపెట్టి పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు నిందితుడు కోసం గాలిస్తూనే ఉన్నారు. కుమారుడు చనిపోవడంతో మొదటి భార్య కరియమ్మ ఊరు వదిలేసి బెంగళూరు వెళ్ళిపోయిందని.. గ్రామస్తులంతా విషయం మర్చిపోయారని.. పోలీసులు కూడా కేసు గురించి పట్టించుకోవడంలేదని తిప్పేస్వామి చిన్ననాటి స్నేహితుడు నాగరాజు చెప్పాడు.

దీంతో నాలుగు నెలల క్రితం తన రెండవ భార్య కూతురు సౌమ్య పెళ్లికి రావాల్సిందిగా చిన్ననాటి స్నేహితుడు నాగరాజుకు పెండ్లి పత్రిక పంపించాడు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన పెండింగ్ కేసులపై దృష్టి పెట్టిన పోలీసులు… నాగరాజు.. తిప్పేస్వామి రెండో భార్య కూతురు పెళ్లికి వెళ్లి వచ్చిన విషయం తెలుసుకుని ఆరా తీశారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు తిప్పేస్వామి అలియాస్ కృష్ణ గౌడ కోసం స్కెచ్ వేశారు. తిప్పేస్వామి స్వగ్రామమైన దిన్నేహట్టిలో ఉన్న భూమి వివాదం పరిష్కరించుకోవాలని నాగరాజు… నిందితుడు తిప్పే స్వామికి చెప్పాడు. భూమికి సంబంధించిన వివాదం పరిష్కారం కోసం దిన్నేహట్టికి వచ్చిన తిప్పేస్వామిని పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. నేరం చేసినవాళ్లు ఎప్పటికీ తప్పించుకోలేరన్న విషయం తిప్పేస్వామి అరెస్టుతో తెలిసింది. 26 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నిందితుడిని ఎంతో చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందికి ఎస్పీ రత్న అభినందనలు తెలుపుతూ రివార్డు అందజేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Dec 01, 2024 12:29 PM