‘వతన్ కో జానో’ ( దేశం గురించి తెలుసుకో) కార్యక్రమంలో భాగంగా ఆదివారం (డిసెంబర్ 24) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కశ్మీర్ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. జమ్మూ కశ్మీర్‌లోని అన్ని జిల్లాలనుంచి మొత్తం 250 మంది విద్యా్ర్థులు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. ఇప్పటికే జైపూర్, అజ్మీర్, ఢిల్లీ ప్రాంతాలను సందర్శించిన వీరు ఆదివారం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చప్పట్లు కొడుతూ ప్రధానికి సాదర స్వాగతం పలికారు విద్యార్థులు. మోడీతో కలిసి ఫొటోల దిగారు. ఇక మోడీ కూడా విద్యార్థుల అలవాట్లు, అభిరుచులు, లక్ష్యాలు, అలాగే ప్రయాణపు అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి కెరీర్ పరంగా విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం ప్రధాని మోడీ, విద్యార్థులందరూ ఫొటోలు దిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి తమను కలవడంతో కశ్మీరీ విద్యార్థులు ఆనందంతో పొంగిపోయారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. ఆయనను మేమెప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు. అలాంటిది ఇప్పుడు ప్రధాని మా ముందు నిలబడ్డారు. మాకు ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. మాకు ఇలాంటి అద్భుత అవకాశం వస్తుందని అసలు ఊహించలేదు’ అని ఒక విద్యార్థిని చెప్పుకొచ్చింది.
‘మేము మా రాష్ట్రం కశ్మీర్‌ను దాటి వేరే రాష్ట్రాల్లోకి రావడం ఇదే మొదటిసారి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాకే మా ప్రాంతాల్లో చదువుకు ప్రాముఖ్యత పెరిగింది. ఇప్పుడు ప్రధాని మోడీని మేం కలిసి ఫొటోలు కూడా దిగాం. ఆయన మాకెంతో విలువైన సలహాలిచ్చారు. ఆయన చెప్పిన మాటలు మాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. దేశం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆకాంక్షను పురిగొల్పాయి’ అంటూ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు.