AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddipet District: 'నీకు పుణ్యం ఉంటది.. యూరియా ఇవ్వు సారూ..' MRO కాళ్లు మొక్కిన రైతన్న

Siddipet District: ‘నీకు పుణ్యం ఉంటది.. యూరియా ఇవ్వు సారూ..’ MRO కాళ్లు మొక్కిన రైతన్న

P Shivteja
| Edited By: |

Updated on: Sep 04, 2025 | 5:37 PM

Share

కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాళ్లు మొక్కుతున్నారు. గోడలు దూకుతున్నారు. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయినా ఫలితం దక్కడం లేదు. ఇలా రోజులు, వారాలుగడుస్తున్నా యూరియా దొరకడం లేదు. క్యూలైన్లు తరగడం లేదు. గోస తీరడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలు, ఊపందుకున్న సాగు పనులతో రైతు ఆశలు చిగురించాయి. కానీ, ఆ ఆశలకు ప్రాణం పోయాల్సిన యూరియా మాత్రం దొరకడం లేదు.

సాగు పనులు జోరుగా నడుస్తున్న ఈ తరుణంలో రోజుల కొద్దీ దుకాణాల ముందు నిరీక్షిస్తున్నారు రైతులు. రేయి పగలు ఎరువుల దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. తెల్లారి లేచింది మొదలు తిండి తిప్పలు మాని ఎరువుల దుకాణాల ముందు బారులు తీరినా బస్తా యూరియా దొరకట్లేదు. తమవంతు వచ్చేసరికి ఉన్న సరుకు అయిపోతుందేమోనని ఆందోళన. పక్కకెళ్తే కష్టమని కడుపులు మాడ్చుకుంటున్నారు. పంటకు ప్రాణంపోసే ఎరువు దొరికితే చాలనుకొని గంటల తరబడి క్యూ లైన్‌లో పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడాగిందో.. ఎందుకాగిందో మాకెందుకు.. యూరియా ఇవ్వండి సార్‌..! అంటూ బారులుతీరుతోంది తెలంగాణ రైతాంగం.

అర్ధరాత్రి నుంచి క్యూ లైన్‌లో  చెప్పులు, సంచులు పెడుతూ ఉదయం 5 గంటలకే యూరియా కేంద్రాల వద్ద పడికాపులు కాస్తున్నారు రైతులు.. అయినా కూడా యూరియా దొరకకపోవడంతో తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారు.. రోడ్ల మీదకి ఎక్కి, ధర్నాలు, రాస్తారోకోలు చేసిన లాభం లేకపోవడంతో అధికారుల కాళ్లు మొక్కాల్సిన పరిస్థితి రైతన్నలది.  తమకు యూరియా పంపిణీ చేయకపోతే తాము వేసిన వరి పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోతుందని, మాకు యూరియా ఇప్పించాలని, ఓ రైతు ఎమ్మార్వో కాళ్లు మొక్కిన సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే…సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో యూరియా కోసం రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత 20 రోజుల నుంచి తమ వ్యవసాయ బావుల వద్ద పనులను వదులుకొని భార్యా, పిల్లలతో రైతు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. చెప్పులను, పట్టా, పాస్ బుక్కులను వరుసలో పెట్టి రోజుల తరబడి ఎదురుచూస్తున్న తమకు ఇప్పటికీ వరకు యూరియా దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని, అప్పులు చేసి వేసిన పంటకు పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు.  ఇప్పుడు వరి పంటకు యూరియా వేయకపోతే తమ పంట దిగుబడి తగ్గి అప్పులే మిగులుతాయని.. ఎలాగైనా యూరియా బస్తాలు ఇప్పించాలని ఓ రైతు హుస్నాబాద్ ఎమ్మార్వో లక్ష్మారెడ్డి కాళ్లు మొక్కి తమ గోడును వెళ్లబోసుకున్నాడు.