తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలకు రూ. 7 వేల స్టైపెండ్
తెలంగాణలో బీసీ స్టడీ సర్కిళ్లలో కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సివిల్స్ అభ్యర్థుల నెలవారీ స్టైపెండ్‌ను రూ.5 వేల నుంచి రూ.7 వేలకు పెంచింది. బుక్ ఫండ్‌ను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు చేసింది. గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే, ఎస్ఎస్సీ కోచింగ్ అభ్యర్థులకు కూడా స్టైపెండ్ పెంపు వర్తించనుంది. ఈ కొత్త మొత్తాలు నవంబర్ నుంచే అమల్లోకి వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా బీసీ స్టడీ సర్కిళ్లలో కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు ఆర్థికంగా మరింత అండగా నిలిచేందుకు స్టైపెండ్ మొత్తాన్ని పెంచింది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న వాళ్లకే కాదు.. గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే, స్టాఫ్ సెలక్షన్ వంటి ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కూడా ఈ నిర్ణయం ప్రయోజనం కలిగించనుంది. మరి ఎవరికి ఎంత పెరిగింది? ఈ నెల నుంచే అమల్లోకి రానున్న ఈ కొత్త స్టైపెండ్ గురించి డీటెయిల్డ్‌గా చూద్దాం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి ఏడాది మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వివిధ పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందిస్తున్నారు. అయితే కోచింగ్ తీసుకునే సమయంలో అభ్యర్థులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం నెలవారీ స్టైపెండ్‌తో పాటు బుక్ ఫండ్ కూడా అందిస్తోంది. ఇప్పుడు ఈ మొత్తాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా సివిల్స్ అభ్యర్థుల విషయానికి వస్తే.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్‌కు ఎంపికైన వారికి ఇప్పటివరకు నెలకు రూ.5 వేల స్టైపెండ్ ఇచ్చేవారు. తాజాగా ఈ మొత్తాన్ని రూ.7 వేలకు పెంచారు. అంటే నెలకు అదనంగా రూ.2 వేలు అందనున్నాయి. అంతేకాదు.. పుస్తకాల కొనుగోలు కోసం ఏడాదికి ఒకసారి ఇచ్చే బుక్ ఫండ్‌ను కూడా రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. అంటే పుస్తకాల కోసం ఇచ్చే ఆర్థిక సాయం రెట్టింపు అయింది. ఇక గ్రూప్ 1, 2, 3, 4తో పాటు బ్యాంకింగ్, రైల్వే రిక్రూట్మెంట్, స్టాఫ్ సెలక్షన్ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా స్టైపెండ్ పెంచారు. వీటి కోసం నిర్వహించే ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్న వారికి ఇప్పటివరకు నెలకు రూ.1,000 ఇచ్చేవారు. ఇకపై రూ.1,500 ఇవ్వనున్నారు. ఈ పెంపు కూడా ఈ నవంబర్ నెల నుంచే అమల్లోకి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. సివిల్స్ కోసం ఒకసారి కోచింగ్ తీసుకున్నంత మాత్రాన అందరికీ విజయం సాధించడం సాధ్యం కాదు. కొంతమందికి రెండు, మూడు సంవత్సరాల పాటు నిరంతర ప్రిపరేషన్ అవసరమవుతుంది. అలాంటి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని బీసీ స్టడీ సర్కిల్లో గత రెండేళ్లలో సివిల్స్ ఉచిత కోచింగ్ తీసుకున్న పూర్వ విద్యార్థులకు కూడా మరోసారి ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. అయితే వీరిని యూపీఎస్సీ తరహాలో నిర్వహించే స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి తాజా అభ్యర్థులతో సమానంగా స్టైపెండ్ అందిస్తారు. ఇదిలా ఉంటే.. బీసీ స్టడీ సర్కిళ్లలో కోచింగ్ సదుపాయాలను కూడా మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా స్టడీ సర్కిల్ భవనాల్లో స్టడీ రూమ్స్ ఏర్పాటు చేయడం, డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. అంతేకాదు.. హైదరాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో గోడలపై చరిత్ర, భౌగోళిక శాస్త్రం, భారత రాజ్యాంగం, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి అంశాలను పెయింటింగ్స్ రూపంలో ఏర్పాటు చేసిన విధానాన్ని కూడా మంత్రి ప్రశంసించారు. మొత్తానికి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న బీసీ నిరుద్యోగ యువతకు స్టైపెండ్ పెంపుతో పాటు మెరుగైన కోచింగ్ వసతులు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆర్థికంగా మరింత భరోసా కల్పిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం అభ్యర్థులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది.. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఎంతమంది తమ ప్రభుత్వ ఉద్యోగాల కలను సాకారం చేసుకుంటారో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.40 కోట్లు ఇస్తేనే ఉంటాం.. స్టార్ ప్లేయర్ల భారీ డిమాండ్
కాశీలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి పబ్లిక్ రోప్‌వే సిద్ధం
ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్
భారీ మొసలి కలకలం.. భయాందోళనలో జనం!
మహిళా ఉద్యోగులకు రూ.3 లక్షల విలువైన ఐఫోన్ గిఫ్ట్..
ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్
షాపులోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి
బిడ్డ రక్షణ కోసం తల్లి తపన.. ఆకట్టుకుంటున్న వీడియో
మ్యాగీ అమ్మి రోజుకు రూ.14 వేలు సంపాదన
అద్దె ఇల్లు కావాలని వచ్చి.. అడ్డంగా దోచేశారు!

