పదేళ్ల రికార్డ్‌ బ్రేక్‌… మరో మూడు రోజులు బీ అలర్ట్‌

Updated on: Dec 15, 2025 | 3:44 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను రికార్డుస్థాయి చలి వణికిస్తోంది. గత పదేళ్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదై, అనేక జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఉత్తరాది నుంచి వీచే శీతల గాలుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, పలుచోట్ల నీరు కూడా గడ్డకడుతోంది. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలుగు రాష్ట్రాలను చలిపులి వణికిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవటంతో తెలంగాణలో గత పదేళ్ల వాతావరణ రికార్డులు బద్దలవుతున్నాయి. 28 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదు కావటంతో బాటు చలిగాలుల ధాటికి జనం నానా అవస్థలు పడుతున్నారు. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ చెబుతోంది. రాబోయే మూడు రోజుల పాటు చలి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అతిశీతల గాలులతోపాటు పొగమంచు పెరిగే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇంత చలి ఎప్పుడూ చూడలేదంటున్నారు హైదరాబాదీలు. స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు ధరించక తప్పడం లేదంటున్నారు. గత మూడు రోజులుగా చలి ఎక్కువైందని చెబుతున్నారు. ఇక తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యాయి. హైదరాబాద్‌లో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక పటాన్‌చెరులో అత్యల్పంగా 5.4 డిగ్రీల టెంపరేచర్‌ నమోదయింది. ఆదిలాబాద్ – 7.2, మెదక్ – 7.2, హన్మకొండలో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రామగుండంలో ఉష్ణోగ్రత 10.9 డిగ్రీలకు పడిపోయింది. నిజామాబాద్‌లో 11.2, ఖమ్మం – 12.4, మహబూబ్ నగర్‌లో 13.5 డిగ్రీల టెంపరేచర్‌ రికార్డయింది. ఇక నల్గొండలో 14డిగ్రీలు, భద్రాచలంలో 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక ఇటు ఏపీని కూడా చలి వణికిస్తోంది. మరీ ముఖ్యంగా మన్యం జిల్లాలను చలి గజగజలాడిస్తోంది. సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలే నమోదవుతుండడంతో బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. పాడేరు, అరకులో 4 డిగ్రీల టెంపరేచర్‌ నమోదవ్వడంతో వాటర్‌ గడ్డ కడుతోంది. వ్యవసాయ భూముల్లోని నీరు కూడా గడ్డ కట్టడంతో రైతులెవ్వరూ ఉదయాన్నే పొలాల వైపు వెళ్లట్లేదు. అటు ఉత్తరాది రాష్ట్రాలపై కూడా చలి పంజా విసురుతోంది. పలుచోట్ల కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఢిల్లీలో కనిష్టంగా 7.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా.. గరిష్టంగా 16 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. జమ్ముకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ రాష్ట్రాల్లో హిమపాతం సంభవించింది. పుల్వామా, షోపియాన్‌లో మైనస్‌ 5.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీనగర్, కుప్వారాలో మైనస్ 3.6 డిగ్రీలు, కాజిగుండ్‌లో 2.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉత్తరాఖండ్‌కు కోల్డ్‌ వేవ్‌ అలర్ట్‌ జారీ చేశారు. యూపీ, ఢిల్లీ, బీహార్, పంజాబ్, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు

సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు

హైబీపీతో గుండెకే కాదు.. కంటి చూపునకూ ముప్పే

పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు

అబ్బా జస్ట్ మిస్.. లేదంటే అఖండలో మనోజ్‌ కూడా రెచ్చిపోయేటోడు