AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండలకు పొట్ట ఉబ్బరమా ?? మీ మీల్ ప్లాన్ ఎలా ఉండాలంటే !!

ఎండలకు పొట్ట ఉబ్బరమా ?? మీ మీల్ ప్లాన్ ఎలా ఉండాలంటే !!

Phani CH
|

Updated on: Apr 29, 2026 | 4:01 PM

Share

వేసవిలో గ్యాస్, అసిడిటీతో ఇబ్బందా? వేడి, నీరు తక్కువ తాగడం, వేపుళ్ల వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా కూల్‌గా ఉంచే ఆహారాలను ఎంచుకోవాలి. ఉదయం నుంచి రాత్రి వరకు సరైన ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా కడుపు తేలికగా, శరీరం చురుగ్గా ఉంటుంది. మజ్జిగ, పుచ్చకాయ, పెసర్‌పప్పు వంటివి చేర్చడం వల్ల వేసవిలో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండగలరు.

వేసవిలో గ్యాస్, అసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా? ఉదయం నుంచి రాత్రి వరకు మిమ్మల్ని కూల్‌గా ఉంచే ఆహారాలేవి? ఎండలు ఒక్కసారి పెరిగితే శరీర క్రియ మాత్రమే కాదు, జీర్ణశక్తి కూడా తగ్గుతుంది. ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల గ్యాస్‌, ఎసిడిటీ రూపంలో ఇబ్బంది తప్పదు. చాలా మంది దీనికి కారణం వేడి చేయడం అనుకుంటారు. కానీ నిజానికి తగినంత నీరు తాగకపోవడం, భోజనాల మధ్య ఎక్కువ గ్యాప్ ఉండటం, వేపుళ్లు తినడం ఇవన్నీ కలిసి సమస్యను మరింత పెంచుతాయి. అయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వేసవిలో కొన్ని ఆహారపదార్థాలు తినకూడదన్న నియమేం లేదు, ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అనేదే అసలు సీక్రెట్. సరైన ఆహారం ఎంచుకుంటే కడుపు తేలికగా ఉంటుంది, రోజంతా శరీరం కూడా చురుగ్గా ఉంటుంది. భానుడు భగ్గుమంటున్నాడు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. మధ్యభారత రాష్ట్రాలలో పరిస్థితి నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎండల తీవ్రతకు తెలంగాణాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ రైతు పొలం పనులకు వెళ్లి వడదెబ్బకు గురై అక్కడికక్కడే మరణించాడు. నల్గొండ జిల్లాకు చెందిన 56 ఏళ్ల యాదయ్య, సూర్యాపేట వాసి వేలాద్రి కూడా వ్యవసాయ పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి ప్రాణాలు విడిచారు. మధ్యాహ్న సమయాల్లో రైతులు, కూలీలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐఎండీ ప్రకారం రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఎండల తీవ్రత అధికం కానుంది. అయితే, ఈ భగభగల నుంచి ఉపశమనం కలిగించేలా వర్ష సూచన కూడా ఉంది. ఏప్రిల్ 29 నుంచి మే 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకోవాలి. వేపుళ్లు, మసాలా పదార్థాలకు దూరంగా ఉండి, తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం అల్పాహారం తేలికగా, చల్లదనాన్ని ఇచ్చేలా ఉండాలి.పుచ్చకాయ, బొప్పాయి, ఖర్బూజ వంటి సీజనల్ పండ్లు వేసవిలో అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. వీటితో పాటు 4 నుంచి 6 నానబెట్టిన బాదంపప్పులు తీసుకుంటే శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, ఎనర్జీ అందుతుంది. ఒక బౌల్ పెరుగుతో పాటు పోహా లేదా వెజిటబుల్ దలియా తీసుకుంటే మరింత మంచిది. పెరుగు లోని ప్రోబయోటిక్స్ గట్ హెల్త్‌ను మెరుగుపరచి గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి. లంచ్‌ ముందు స్నాక్ తప్పనిసరి. భోజనాల మధ్య గ్యాప్ పెరిగితే కడుపులో ఆమ్లం ఎక్కువై అసిడిటీ పెరుగుతుంది. అందుకే మిడ్ మార్నింగ్ స్నాక్ చాలా ముఖ్యం. ఈ సమయంలో మజ్జిగలో వేయించిన జీలకర్ర పొడి, పుదీనా కలిపి తాగితే శరీరానికి చల్లదనం ఇస్తుంది. దోసకాయ ముక్కలు, పుచ్చకాయ స్లైసులు తీసుకోవచ్చు. కొద్దిగా నిమ్మరసం, చిటికెడు నల్ల ఉప్పుతో కలిపిన నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. వేసవిలో మజ్జిగను నిజంగా ఒక “సూపర్ ఫుడ్” అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది అసిడిటీకి వెంటనే ఉపశమనం ఇస్తుంది. మధ్యాహ్న భోజనం తేలికగా, సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. మధ్యాహ్న భోజనం అంటే కేవలం కడుపు నింపుకోవడం కాదు, శరీరానికి శక్తి ఇవ్వడం తో పాటు జీర్ణక్రియను సాఫీగా కొనసాగించేలా ఉండాలి. ముఖ్యంగా వేసవిలో లంచ్ తేలికగా, పోషకంగా ఉంటేనే రోజంతా అలసట లేకుండా ఫ్రెష్‌గా ఉండగలం. ఈ సమయంలో ఆహారంలో ఫైబర్, తగినంత నీరు, సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్ తప్పనిసరిగా ఉండాలి. ఫైబర్ మన జీర్ణవ్యవస్థలో స్పాంజ్‌లా పనిచేస్తూ నీటిని పీల్చుకుని ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అంతేకాదు, శరీరంలో వ్యర్థాలను సాఫీగా బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వేసవికాలంలో మధ్యాహ్నం భోజనంగా ఒకటి లేదా రెండు చపాతీలు లేదా కొద్ది మోతాదులో అన్నం తినవచ్చు. దీనికి తోడు పెసరపప్పు దాల్ ఈజీగా జీర్ణమై శక్తినిస్తుంది. సొరకాయ, బీరకాయ, గుమ్మడికాయ వంటి నీరు ఎక్కువగా ఉండే కూరగాయలు ఈ కాలంలో అద్భుతమైన ఎంపిక. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా పొట్టకి తేలికగా అనిపిస్తాయి. భోజనాన్ని పూర్తిచేసే ముందు ఒక గిన్నె పెరుగు లేదా రయితా తీసుకోవడం మంచిది. దోసకాయ, క్యారెట్ ముక్కలు, కొద్దిగా నిమ్మరసం కలిపిన తాజా సలాడ్ తీసుకోవాలి. ఇలా సమతుల్యమైన మధ్యాహ్న భోజనం తీసుకుంటే వేసవి వేడిలో కూడా గ్యాస్, బ్లోటింగ్, అసిడిటీ సమస్యలు దూరంగా ఉంటాయి. సాయంత్రం ఆకలికి తెలివైన ఎంపిక ఏదో చూద్దాం. సాయంత్రం అయ్యేసరికి చాలామంది వేయించిన స్నాక్స్ తింటారు. అదే అసలు సమస్యకు మొదటి అడుగు. బజ్జీలు, చిప్స్ ప్యాకెట్స్ బదులుగా వేయించిన మఖానా లేదా శెనగలు తీసుకోవడం మంచిది. అలాగే పెరుగుతో చేసిన ఫ్రూట్ స్మూతీ కూడా మంచి ఆప్షన్. పాలు కలిపి చేసిన షేక్స్ మాత్రం పీక్ సమ్మర్‌లో తగ్గించాలి. పుదీనా లేదా సోంపుతో హెర్బల్ టీ తీసుకుంటే బ్లోటింగ్ తగ్గి కడుపు తేలిగ్గా ఉంటుంది. రాత్రి భోజనాన్ని ఏడున్నర లోపు ముగించాలి. వేసవిలో రాత్రి జీర్ణక్రియ మరింత నెమ్మదిస్తుంది. అందుకే డిన్నర్ చాలా తేలికగా ఉండాలి. వెజిటబుల్ కిచిడీ, పెసరట్టు, పుదీనా చట్నీ లేదా లైట్ వెజిటబుల్ సూప్ అద్భుతమైన ఎంపికలు. ముఖ్యంగా నిద్రకు కనీసం 2 నుంచి 3 గంటల ముందే భోజనం పూర్తి చేయాలి. ఆలస్యంగా తింటే అసిడిటీ మరింత పెరుగుతుంది. పడుకునే ముందు చిన్న అలవాటు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. రాత్రి నిద్రకు ముందు కొద్దిగా గోరువెచ్చని నీటిలో చిటికెడు సోంపు పొడి కలిపి తాగడం లేదా కొన్ని సోంపు గింజలు నమలడం మంచిది. ఈ చిన్న అలవాటు ఉదయం లేచేసరికి కడుపు ఉబ్బరం తగ్గడానికి సహాయపడుతుంది. చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం. రోజుకు రెండున్నర నుంచి 3 లీటర్ల నీరు తప్పక తాగాలి. ఆహారం నెమ్మదిగా నమిలి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వేసవిలో ఆహారాన్ని పూర్తిగా నియంత్రించడం కాదు, తాజాగా లభించే సీజనల్, తక్కువ ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తెలివిగా ఎంచుకోవడమే అసలు మంత్రం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేసవిలో ‘సైలెంట్ కిల్లర్‌’ లోలోపలే ఉడికిపోతున్న జనం !! ఏసీలో ఉన్నా తప్పని ముప్పు !!

Chiyaan Vikram: యంగ్ లుక్‌ కోసం రిస్క్‌ చేసిన విక్రమ్‌

షాకింగ్! మసాజ్ కోసం.. ఏకంగా రూ.7.25 లక్షలు ఖర్చు చేసిన హీరోయిన్..

Follow Us