రాజకీయాల నుంచి సినిమాల్లోకి జగ్గారెడ్డి వీడియో
అసలు పేరు ‘తూర్పు జయప్రకాశ్ రెడ్డి’ కంటే ‘జగ్గారెడ్డి’గా జనానికి సుపరిచితుడైన నేత ఆయన. తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు సరికొత్త సంచలనానికి ఆయన శ్రీకారం చుట్టారు. రాజకీయాలకు స్వల్ప విరామం ప్రకటించి సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. సినిమా అంటే నిర్మాతగానో.. దర్శకుడిగానో అనుకునేరు. కాదు.. ఆయన నటనలోకి అడుగుపెట్టి.. తన నిజజీవిత పాత్రను తానే పోషించబోతున్నారు.
కేవలం తెలుగులోనే కాదు.. హిందీలోనూ ఆ సినిమాను విడుదల చేసి ‘పాన్ ఇండియా’ స్థాయిలో తన ప్రతిభ చాటేందుకు సిద్ధమయ్యారు జగ్గారెడ్డి.రాజకీయాల్లో రాజీలేని పోరాటం చేస్తానని చెబుతున్న జగ్గారెడ్డి.. ఢిల్లీ మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో సినీ రంగ ప్రవేశం గురించి ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన పేరుతోనే “జగ్గారెడ్డి – ఎ వార్ ఆఫ్ లవ్” టైటిల్‌తో సినిమా తీస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అదొక ప్రేమ కథ చిత్రమని, అందులో ప్రత్యేక పాత్ర పోషించబోతున్నానని వెల్లడించారు. మాఫియాను ఎదురించి ఆడపిల్ల పెళ్ళి చేసే వ్యక్తిగా తాను సినిమాలో కనిపిస్తానని అన్నారు. ఈ మధ్య వద్ది రామానుజం తన దగ్గరకు వచ్చి ఒక కథ ఉంది అని చెప్పారన్నారు. ఆ కథలో తన నిజ జీవిత పాత్రే ఉందని చెప్పగా.. తానే ఆ పాత్రలో నటిస్తానని చెప్పానని జగ్గారెడ్డి అన్నారు. ఈ ఉగాదికి కథ విని.. వచ్చే ఉగాది నాటికి సినిమా పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్ర నాయకత్వంతో పాటు ముఖ్యమంత్రి అనుమతి తీసుకుని ఈ సినిమాలో నటిస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు. తెలుగు, హిందీ భాషల్లో సినిమా నిర్మాణం పూర్తి చేసి దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :