AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: 52 రోజుల తర్వాత జైలు నుంచి బయటకొచ్చిన చంద్రబాబు.. భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు..

Chandrababu: 52 రోజుల తర్వాత జైలు నుంచి బయటకొచ్చిన చంద్రబాబు.. భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు..

Ravi Kiran
|

Updated on: Oct 31, 2023 | 5:33 PM

Share

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై చంద్రబాబు విడుదల అయ్యారు. 52 రోజుల తర్వాత జైలు నుంచి బయటకొచ్చిన చంద్రబాబు.. షెడ్యూల్ ప్రకారం రాత్రి 9.30కి ఇంటికి చేరుకోనున్నారు చంద్రబాబు. రాజమండ్రి జైలు చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు రేపటి వరకు చంద్రబాబు ర్యాలీలు చేయొద్దని.. మీడియాతో చంద్రబాబు మాట్లాడొద్దని హైకోర్టు ఆదేశించారు.

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు విడుదలయ్యారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడంతో.. 52 రోజుల తర్వాత జైలు నుంచి బయటకొచ్చారు. ఇక.. చంద్రబాబు విడుదల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పెద్దయెత్తున చేరుకోవడంతో రాజమండ్రి జైలు వద్ద కోలాహలం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు కొంత ఊరట లభించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కామ్‌లో అరెస్టై 52 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు 4 వారాల పాటు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఆరోగ్య కారణాలు, కంటి ఆపరేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. నేటి నుంచి నాలుగు వారాల పాటు ఆయనకు బెయిల్‌ మంజూరైంది.

ఐదు సాధారణ షరతులు విధిస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జున రావు తీర్పు చెప్పారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, జైల్లో చేసిన ఆరోగ్య పరీక్షలు, వైద్యుల నివేదికలు, చంద్రబాబు వ్యక్తిగత వైద్యుల లేఖలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తున్నట్టు 15 పేజీల తీర్పులో ప్రస్తావించారు. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ నిన్న హైకోర్టులో ఆయన తరపు న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్‌, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. నేర తీవ్రత ఎలాంటిదైనా వ్యక్తుల ఆరోగ్యం, బాగోగులు అన్నది అత్యంత కీలకమని ఈ కోర్టు భావిస్తోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దర్యాప్తు సమయంలో కస్టడీ అన్నది శిక్షగా మారకూడదని అభిప్రాయపడ్డారు.

తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కస్టడీలో ఉన్నట్టు అయితే.. అలాంటి వారికి మెరుగైన చికిత్స అందుబాటులో ఉండాలన్న వాదనను ఈ కోర్టు నమ్ముతుందని న్యాయమూర్తి తెలిపారు. పిటిషనర్‌ చంద్రబాబు ఎదుర్కొంటున్న ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని… మానవీయ దృక్పథంతో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తున్నట్టు తీర్పు వెలువరించారు. అదే సమయంలో న్యాయప్రక్రియ నుంచి పిటిషనర్‌ తప్పించుకుంటారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తీర్పు కాపీలో న్యాయమూర్తి వెల్లడించారు.

Published on: Oct 31, 2023 04:21 PM