Big News Big Debate: జీ20 సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన ఆహ్వానం ఇప్పుడు దేశరాజకీయాల్లో సంచలనంగా మారింది. సాధారణంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట… ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ కనిపించడంతో కాంగ్రెస్‌లో అనుమానాలు మొదలయ్యాయి. దేశం పేరు కూడా మారుస్తారా అంటూ కొందరు విమర్శలు చేస్తుంటే.. భారత్ మాతా కి జై అంటూ బీజేపీ నేతలు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తున్నారు.
వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై దేశమంతా రచ్చ జరుగుతుండగానే ఇండియా- భారత్ పేర్లపై చర్చ మొదలైంది..
ఇంతకాలం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుతో రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానాలు ఉండేవి. అనూహ్యంగా జీ20 విందు ఆహ్వాన పత్రికల్లో మారింది. మన దేశం పేరును ఇండియా అని పిలవడం మానుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ ఓ సభలో చెప్పిన రెండు రోజులకే జీ-20 ఆహ్వాన పత్రాల్లో భారత్ అని రాయడం సంచలనం రేపుతోంది.
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్‌గా రాశారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత జైరాంరమేశ్. అటు విపక్ష కూటమికి భారత్ అని పేరు పెడితే అది కూడా మారుస్తారా అంటూ ప్రశ్నించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.
దేశ గౌరవానికి సంబంధించిన విషయంపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారని విపక్షాలను ప్రశ్నించారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. భారత్‌జోడో యాత్ర చేసిన వాళ్లు భారత్ పేరుపై ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని నిలదీశారు. అటు భారత్‌గా మార్చడాన్ని బిగ్‌బి అమితాబ్ సమర్ధించారు. భారత్‌మాతాకీ జై అంటూ పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది.
అమృత్‌కాల్ సమయంలో దేశ ప్రజలను బానిస మనస్తత్వం నుండి విముక్తి చేయాలని నొక్కి చెబుతున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, రాజ్యాంగం నుండి ఇండియా అనే పదాన్ని తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబరు 18-22 వరకు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం ఇండియా పదాల తొలగింపు ప్రతిపాదనకు సంబంధించిన బిల్లులను సమర్పించే అవకాశం ఉందంటున్నాయి విపక్షాలు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..