పల్లె బాట పట్టిన పట్నం వాసులు.. విజయవాడ హైవేపై వాహనాల సందడి.. భారీగా ట్రాఫిక్ జామ్!

యాదాద్రి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్‌-విజయవాడ హైవేపై రద్దీ విపరీతంగా పెరిగింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో టోల్‌ ప్లాజా కిక్కిరిసింది. విజయవాడ మార్గంలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఫాస్టాగ్‌ లైన్లలోనూ వాహనాలు బారులు తీయాయి.

పల్లె బాట పట్టిన పట్నం వాసులు.. విజయవాడ హైవేపై వాహనాల సందడి.. భారీగా ట్రాఫిక్ జామ్!
National Highway 65 Panthangi Toll Plaza
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Jan 10, 2025 | 9:29 PM

సంక్రాంతి సెలవులొచ్చాయంటే చాలు హైదారాబాద్- విజయవాడ జాతీయ రహదారి వాహనాల జాతర నెలకొంటుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి వాహనాలు పల్లెటూర్లకు బారులు తీరుతుంటాయి. ఎప్పటిలాగానే ఈ సారిగా భారీ వాహనాల రద్దీ కారణంగా గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ రద్దీలో గంట ప్రయాణానికి మూడు, నాలుగు గంటల సమయం పడుతుంది. గతేడాది సంక్రాంతికి ఇదే సమస్య తలెత్తడంతో వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్ లో చిక్కుకుని నరకం చూశారు. ఈ హైవేపై సంక్రాంతి పండుగ వేళ ప్రయాణించే వాహనదారులారా జాగ్రత్త..!

సంక్రాంతి పండుగ అంటే మూడు రోజుల ముచ్చటైన పండుగ. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ పండుగను అంబరాన్నంటేలా నిర్వహిస్తారు. సంక్రాంతికి పట్టణాల నుంచి పల్లెలకు బాట పడుతుంటారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి వేలాది కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలకు వెళుతుంటాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు జర జాగ్రత్త..! ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ మినహా మిగతా అన్ని ప్రాంతాలకు రోడ్డు మార్గంలో వెళ్లే వారికి ఇదే ప్రధాన రహదారి. లెక్కకు మించిన వాహనాలు బారులు తీరడంతో సంక్రాంతి సమయంలో ఈ హైవేపై ట్రాఫిక్‌ నత్త నడకన సాగుతుంది. ఇక సంక్రాంతికి ముందు రోజైతే టోల్‌గేట్ల వద్ద గంటల తరబడి స్తంభించిపోతుంది.

సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది. బస్సు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోయింది. పండక్కి ఎంత దూరమైనా, ఎంత ఖర్చయినా ఊరెళ్లాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఈ పరిస్థితిని ప్రైవేటు ట్రావెల్స్‌ క్యాష్‌ చేసుకుంటున్నాయి. టిక్కెట్లు బ్లాక్‌ చేసి , రెండు మూడు రెట్లు దోచేస్తున్నారు. చివరికి ఏసీ బస్సులు ఫుల్‌ అయ్యాయంటూ , నాన్‌ ఏసీ టిక్కెట్లను కూడా ఏసీ రేట్లకు అమ్ముతున్నారు. మరోవైపున ఆర్టీసీ హౌస్‌ఫుల్‌ కావటం కూడా , ప్రైవేటు ట్రావెల్స్‌కి వరంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ నుండి ఆంధ్ర వైపునకు వేలాది వాహనాలు కార్లు వెళ్తున్నాయి. హైదరాబాదు నుండి విజయవాడకు వెళ్లే దారిలో 10 టోల్ బూతులను ఓపెన్ చేశారు. హైదరాబాద్ కు వెళ్లే మార్గంలో ఆరు బూతుల ద్వారా వాహనాలకు అనుమతినిస్తున్నారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జనవరి 11 నుంచి 17 వరకు పండగ సెలవులను ప్రకటించాయి. ఈనెల 11న రెండో శని వారం కావడంతో పదో తేదీన శుక్రవారం సాయంత్రం నుంచే రద్దీ మొదలైంది. సోమవారం భోగి కావడంతో.. శని, ఆది రెండ్రోజులు రద్దీ అధికంగా ఉండనుంది. ఈ జాతీయ రహదారి మొత్తం 273 కిలోమీటర్లు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181.5 కిలోమీటర్లు టోల్ రోడ్డు ఉంటుంది. టోల్ రోడ్డు పరిధిలో తెలంగాణలో పంతంగి (చౌటుప్పల్), కొర్లపహాడ్ (కేతేపల్లి), ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలున్నాయి. గతేడాది జూన్ 31 తర్వాత జీఎమ్మార్ సంస్థ టోల్ వసూలు, నిర్వహణ బాధ్యతల నుండి వైదొలగింది. ఆ తర్వాత NHAI టోల్ వసూళ్లను మూడు, నిర్వహణను మరో ఏజెన్సీకి అప్పజెప్పింది.

గతేడాది భోగికి ముందు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా మీదుగా 77 వేల పైచిలుకు.. అంతకు ముందు రోజూ 67 వేలకు పైగా వాహనాలు వెళ్లాయి. రెండు రోజుల్లోనే 1.45లక్షల వాహనాలు రికార్డు స్థాయిలో వెళ్లడం గతేడాదే తొలిసారి. ఈసారి కూడా గతేడాది స్థాయిలోనే వాహనాలు వెళ్లే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, పోలీసు అధికారుల సూచనలతో టోల్ ప్లాజాల వద్ద, ప్రధాన పట్టణాల్లో రద్దీ నివారణకు చర్యలు ఏజెన్సీలు తీసుకుంటాయి.

ఈ నేపథ్యంలోనే రహదారిపై పండగ వేళ ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి. ప్రమాదాల నివారణకు లైటింగ్, సైన్‌ బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు చేపట్టారు. రేడియం స్టిక్కర్లతో కూడిన రోడ్‌ మార్జిన్‌ మార్కింగ్‌లూ వేశారు. బ్లాక్ స్పాట్స్ వద్ద జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. హైవేపై ట్రాఫిక్ లేకుండా నియంత్రించేందుకు ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి తెలిపారు.

వీడియో చూడండి.. 

హైవేపై సంక్రాంతి రద్దీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎన్‌హెచ్‌ఏఐ, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసింది. మూడు టోల్ ప్లాజాల వద్ద పెట్రోలింగ్ వాహనం, క్రేన్, అంబులెన్సును, 30 కిలో మీటర్లకు ఒక క్రేన్, పెట్రోలింగ్ వాహనం, అంబులెన్సు. 60 కిలోమీటర్లకు ఒక టోయింగ్ వెహికిల్ ఏర్పాటు చేస్తున్నట్లు NHAI అధికారులు చెబుతున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఉన్నా 1033 నంబర్‌కు ఫోన్‌ చేయాలని ప్రతినిధులు సూచిస్తున్నారు. NHAI అధికారులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..