హిప్ జాయింట్ రిప్లేస్‌మెంట్ తర్వాత.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. యశోద వైద్యుల పర్యవేక్షణలో ఉన్న గులాబీ బాస్‌కు.. రాజకీయాలకు అతీతంగా పరామర్శల వెల్లువ కొనసాగుతోంది. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఇవాళ కూడా పలురంగాల ప్రముఖులు పరామర్శించారు. పార్టీలకతీతంగా రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఆయనను కలిసి వెళ్తున్నారు. సోమవారం సాయంత్రం యశోద ఆస్పత్రికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. కేసీఆర్‌ను కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రకాష్ రాజ్ ఆకాంక్షించారు.
గవర్నర్ తమిళిసై కూడా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఫోన్‌లో వైద్యులను ఆరాతీశారు. కుటుంబసభ్యులతోనూ మాట్లాడారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికార కాంగ్రెస్ నుంచి కేసీఆర్‌కు పరామర్శల వెల్లువ కొనసాగుతోంది. ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క.. యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. కేసీఆర్‌ను కలిశారు. ఆయన చికిత్స పొందుతున్న గదికి వెళ్లి.. కాసేపు అక్కడే కూర్చుని ముచ్చటించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబుకు వివరించారు వైద్యులు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాజీవితంలోకి వస్తారని చెప్పారు చంద్రబాబు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా కేసీఆర్‌ను పరామర్శించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..