కుంభమేళా చుట్టూ చిట్టడవి.. స్వచ్ఛమైన గాలికి కొదవే లేదు..

కుంభమేళా చుట్టూ చిట్టడవి.. స్వచ్ఛమైన గాలికి కొదవే లేదు..

Phani CH

|

Updated on: Jan 27, 2025 | 5:07 PM

ఉత్తర్​ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు కోట్లాది భక్తజనం పోటెత్తుతున్నా స్వచ్ఛమైన గాలికి కొదువ ఉండటం లేదు. దీంతో పర్యావరణపరంగానూ ఈ పుణ్య నగరి శభాష్ అనిపించుకుంటోంది. ఇందుకు కారణం ఒక జపనీస్ టెక్నిక్. ఇంతకీ అదేంటి? దానివల్ల ప్రయాగ్​రాజ్‌లో స్వచ్ఛమైన గాలి, పుష్కలమైన ఆక్సిజన్ ఎలా అందుబాటులోకి వచ్చింది? అనే వివరాలు తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే.

వాస్తవానికి ఈ మహా కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రెండేళ్ల క్రితమే కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రయాగ్ రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ మియవాకి అనే జపనీస్ సాంకేతికతతో ప్రయాగ్‌రాజ్ పరిధిలో చిట్టడవిని తయారు చేసింది. అది ఆషామాషీగా తయారు కాలేదు. ఇందుకోసం ప్రయాగ్ రాజ్‌లోని 10 ప్రదేశాల్లో ఉన్న 18.50 ఎకరాల భూమిలో 5 లక్షలకుపైగా మొక్కలను నాటారు. ఈ మొక్కలు చెట్లుగా ఎదిగి, ఇప్పుడు ప్రతిరోజు దాదాపు 11.5 కోట్ల లీటర్ల ఆక్సిజన్‌ను వాతావరణంలోకి వదులుతున్నాయి. ప్రస్తుతం ఒక్కో చెట్టు ఎత్తు దాదాపు 25 ఫీట్ల నుంచి 30 ఫీట్ల దాకా ఉంది. ఒక్కో చెట్టు నుంచి రోజూ సగటున 230 లీటర్ల ఆక్సిజన్ విడుదలవుతుంది. మియవాకి టెక్నిక్‌తో ఇదంతా సాకారం చేయడానికి ప్రయాగ్​రాజ్ మున్సిపాలిటీ దాదాపు రూ.6 కోట్లను ఖర్చు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 63 రకాల మొక్కలను నాటారు. ఈ జాబితాలో మర్రి, రావి, వేప, మహువా, మామిడి, చింత, తులసి, తామర, కదంబ, బ్రాహ్మి, ఉసిరి, రేగి, వెదురు, నిమ్మ, మునగ వంటివి ఉన్నాయి. పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు, అలంకార ప్రాయ మొక్కలన్నీ ఈ చిట్టడవిలో ఉండటం విశేషం. దీని నిర్వహణ కాంట్రాక్టును మూడేళ్ల వ్యవధి కోసం ఒక కంపెనీకి అప్పగించారు. వచ్చే నెలలో ఈ మేళా ముగిసే సరికి దాదాపు 45 కోట్ల మంది భక్తులు సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. ఇంత భారీగా భక్తజనం తరలి వచ్చినా ఆక్సిజన్ కొరత ఉండకుండా ప్రయాగ్ రాజ్‌లోని చిట్టడవి ఊపిరులు ఊదుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శివ శంకర్‌గా మారిన సద్దాం హుసేన్.. ప్రియురాలి కోసం హిందువుగా

అక్షయ్ సినిమాపై వివాదం భగ్గుమంటున్న ఆ వర్గం