భారత మార్కెట్లో బంగారం, వెండి కొత్త రికార్డులు నమోదు చేశాయి. సమీప భవిష్యత్తులో కూడా పసిడి మెరుపులు ఇలాగే కొనసాగేలా కనిపిస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఒక్కసారిగా భారీగా పెరిగింది బంగారం ధర. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఆల్ టైం గరిష్ఠానికి చేరువలోకి వెళ్ళింది. అప్పట్లో ఔన్సుకు 3500 డాలర్ల మార్కును దాటగా.. ఇప్పుడు 3480 స్థాయిలో కదలాడుతుంది. ఇన్ని రోజులు 24 క్యారెట్ల బంగారం ధర తులం లక్ష రూపాయల మార్కు దాటడమే ఒక రికార్డు అనుకుంటే ఇప్పుడు 22 క్యారెట్ల ధర కూడా లక్షకు చేరువలో ఉంది.
హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 9750 దగ్గర ఉంటే 24 క్యారెట్ల పసిడి ధర లక్ష ఐదు వేల 880కి చేరింది.ఎంసిఎక్స్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరాయి. సురక్షితమైన పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ పెరగడం.. రూపాయి బలహీనపడటం.. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోవడం కూడా దేశీయంగా బంగారం ధరలు పెరగడానికి కారణమైంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌తో పసిడికి డిమాండ్ పెరుగుతుంది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఒక్క రోజే రెండు శాతానికి పైగా పెరిగి ఔన్సుకు 40.65 డాలర్ల మార్కును దాటింది. 2011 సెప్టెంబర్ తర్వాత 14 ఏళ్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది వెండి కూడా. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర లక్ష 26 వేల దగ్గర ట్రేడ్ అవుతుంది.

