
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటిస్తున్నారు. దీంతో ఉస్మానియా పరిసరాల్లో హైటెన్షన్ నెలకొంది.. సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో కొత్త హాస్టల్ భవనాలను ప్రారంభించారు. రూ.80 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. గిరిజన విద్యార్థుల కోసం మరో రెండు హాస్టళ్లకు శంకుస్థాపన చేశారు. సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రారంభించారు.. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులనుద్దేశించి సీఎం ప్రసంగించారు. ఓయూ తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం అని.. పీవీ నరసింహారావు ఓయూ గడ్డమీద నుంచే ధిక్కారస్వరం వినిపించారంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పీవీ నరసింహారావు ఈ యూనివర్శిటీలో చదివారని.. తెలంగాణ సమాజానికి సమస్య వచ్చినా సంక్షోభం వచ్చినా చర్చ ఇక్కడే జరుగుతుంది.. తెలంగాణలో ఏ సమస్య అయినా ఉద్యమం ఇక్కడే మొదలవుతుందన్నారు. 4 కోట్ల తెలంగాణ వాసుల గళం ఉస్మానియా.. జార్జిరెడ్డి, శ్రీకాంతాచారి, వేణుగోపాలరెడ్డి వంటివారు ఉద్యమంలో అమరులయ్యారన్నారు.
20 ఏళ్లలో ఓయూకు సీఎం హోదాలో వచ్చి ప్రసంగించనున్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నిలవనున్నారు. దీంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
సీఎం రాకతో ఓయూ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. సీఎం పర్యటనను అడ్డుకుంటామని పలువురు విద్యార్థి సంఘాల నేతల ప్రకటనలతో అలర్ట్ అయ్యారు. ఇప్పటికే పలువురు BRSV నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు.