Viral News: దేశమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలామంది ఇంటికే పరిమితమయ్యారు. అత్యవసరమైతేనే బయటకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక జొమాట్ ఫుడ్ డెలివరీ బాయ్ చేసిన ఓ మంచి పని అందరి మన్ననలు అందుకుంటోంది. కేరళలోని కొచ్చికి చెందిన జితిన్ విజయన్ జొమాటో (Zomato) లో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఎప్పటిలాగే అర్ధరాత్రి ఫుడ్ డెలివరీ ఆర్డర్ వచ్చింది.. విధి నిర్వహణలో భాగంగా వర్షంలోనే 12 కిలోమీటర్లు ప్రయాణించి ఆ లొకేషన్‌కి వెళ్లాడు. ఎట్టకేలకు ఆ ఇంటికి రీచ్ అయి ఫుడ్ డెలివరీ చేశాడు. అంతటితో అతని డ్యూటీ అయిపోయింది. అయితే అక్కడో మహిళ మహిళ ఏడాది వయసున్న చిన్నారితో కనిపించింది. అప్పటికే ఆ చిన్నారి తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. అసలే అర్ధరాత్రి.. ఆపై కుండపోత వర్షం.. ఈ సమయంలో ఆ మహిళ బయటకు వెళ్లి మందులు తీసుకురావడం అసాధ్యం. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న డెలివరీ బాయ్ విజయన్ వెంటనే వర్షంలో చిన్నారి మందుల కోసం బయలుదేరాడు. మరో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎట్టకేలకు చిన్నారికి మందులు తీసుకొచ్చాడు.
గ్యాలంట్రీ పురస్కారంతో..
\కాగా తనకెందుకులే అనుకోకుండా భారీ వర్షంలో మానవత్వంతో విజయన్ వ్యవహరించిన తీరుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. జొమాటో యాజమాన్యం కూడా అతను చేసిన మంచి పనిని అభినందించింది. ఇటీవల జొమాటో 14వ వార్షికోత్సవంలో విజయన్‌ను గ్యాలంట్రీ పురస్కారంతో సత్కరించింది. ఈ విషయాన్ని లింక్డెన్ పోస్టులో వెల్లడించింది జొమాటో. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది. కేవలం ఫుడ్ అందించి నాకెందుకులే అనుకోకుండా అతడు చేసిన పని అనేక మంది మనస్సులను కదిలించింది. అతడి సాహసోపేతమైన చర్యకు నెటిజన్లు ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..