పామును మరో పాము కరిస్తే చనిపోతుందా..? ప్రకృతి దాచిన విష రహస్యం ఇదే..
సాధారణంగా పాము విషం మనుషులకు, ఇతర జంతువులకు అత్యంత ప్రమాదకరం. కానీ ఒక విషపు పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది? అసలు పాము విషం పాముకే ప్రాణాంతకమా? లేక ప్రకృతి వాటికి ఏదైనా ప్రత్యేక రక్షణ కవచాన్ని ఇచ్చిందా? ఈ వింతైన ప్రశ్న వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన శాస్త్రీయ నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రకృతిలో అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములు ఒకటి. సాధారణంగా పాము కాటు వేస్తే ఇతర జీవులు నిమిషాల్లో ప్రాణాలు కోల్పోతాయి. అయితే ఒక విషపు పాము తన జాతికి చెందిన మరో పామును కరిస్తే ఏమవుతుంది? లేదా వేరే జాతి పామును కరిస్తే అది తట్టుకోగలదా? ఈ విషయాలపై హెర్పెటాలజిస్టులు చెబుతున్న ఆసక్తికరమైన వాస్తవాలు చెబుతున్నారు. పరిణామ క్రమంలో పాములు తమ సొంత జాతి విషాన్ని తట్టుకునేలా రోగనిరోధక శక్తిని పెంపొందించుకున్నాయి.
సొంత విషానికి రెసిస్టెన్స్
నాగుపాము వంటి విషసర్పాల శరీరంలో వాటి సొంత విషాన్ని తటస్థీకరించే ప్రత్యేకమైన ప్రోటీన్లు, యాంటీబాడీలు ఉంటాయి. ఆహారం కోసం పోరాడేటప్పుడు లేదా సంభోగ సమయంలో పాములు ఒకదానినొకటి కరుచుకునే అవకాశం ఉంటుంది. ప్రతి కాటుకూ పాము చనిపోతే ఆ జాతి మనుగడే కష్టమవుతుంది. అందుకే ప్రకృతి వీటికి సహజ సిద్ధమైన నిరోధకతను ఇచ్చింది.
వేరే జాతి పాము కరిస్తే ప్రమాదమే
ఒక పాము తన జాతి విషాన్ని తట్టుకోగలదు కానీ వేరే జాతి విషాన్ని తట్టుకోలేదు. నరాలపై ప్రభావం చూపించే విషం ఉండే నాగుపామును రక్తంపై ప్రభావం చూపించే విషం ఉండే రాటిల్ స్నేక్ కరిస్తే.. ఆ నాగుపాము చనిపోయే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే నాగుపాము శరీరం రాటిల్ స్నేక్ విషంలోని టాక్సిన్లను ఎదుర్కోలేదు.
విషపు పాములను తినే పాములు
ప్రకృతిలో కొన్ని పాములు ఇతర విషసర్పాలనే ఆహారంగా తీసుకుంటాయి. కింగ్ కోబ్రా ఇతర పాములను వేటాడుతుంది. ఇలాంటి పాములకు ఇతర విషసర్పాల విషాన్ని తట్టుకునే అసాధారణ సామర్థ్యం ఉంటుంది. వీటి రక్తంలో ఉండే ప్రత్యేక ఎంజైమ్లు ఇతర పాముల విషాన్ని విచ్ఛిన్నం చేస్తాయి.
మరణానికి అసలు కారణం విషం కాకపోవచ్చు
ఒకవేళ పాము కరిచిన తర్వాత మరో పాము చనిపోతే అది కేవలం విషం వల్ల మాత్రమే కాకపోవచ్చు. పాము పళ్లు లోతుగా దిగడం వల్ల కలిగే తీవ్రమైన గాయం లేదా ఆ గాయం ద్వారా సోకే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా పాములు మరణిస్తాయి. కొన్నిసార్లు ఒత్తిడికి లోనైనప్పుడు లేదా అయోమయంలో పాములు తమను తాము కరుచుకుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా అవి తమ సొంత విషం వల్ల చనిపోవు.
క్లియర్‌గా చెప్పాలంటే, పాములకు తమ సొంత విషం పట్ల కొంతవరకు ఇమ్యూనిటీ ఉంటుంది. కానీ అది అన్ని రకాల విషాలకు వర్తించదు. విషం అనేది వాటికి కేవలం ఆహారాన్ని వేటాడటానికి, ఆత్మరక్షణకు ఉపయోగపడే ఒక ఆయుధం మాత్రమే.
