World’s Oldest Woman: తుదిశ్వాస విడిచిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు.. ఆమె దీర్ఘాయుష్షుకు కారణమేంటో తెలుసా?..

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు జపాన్‌కు చెందిన కెన్ తనకా (119) కన్నుమూశారు. ఏప్రిల్ 19 న ఆమె తుదిశ్వాసవిడిచినట్లు జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

World's Oldest Woman: తుదిశ్వాస విడిచిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు.. ఆమె దీర్ఘాయుష్షుకు కారణమేంటో తెలుసా?..
Kane Tanaka
Follow us
Basha Shek

|

Updated on: Apr 26, 2022 | 12:01 PM

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు జపాన్‌కు చెందిన కెన్ తనకా (119) కన్నుమూశారు. ఏప్రిల్ 19 న ఆమె తుదిశ్వాసవిడిచినట్లు జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పశ్చిమ జపాన్‌లోని ఫుకువా నగరంలోని ఓ ఆస్పత్రిలో వృద్ధాప్య రిత్యా సమస్యలతో కెన్ తనకా (Kane Tanaka) కన్నుమూసినట్లు ఈ ప్రకటనలో తెలిపింది. కాగా కెన్‌ మరణంతో ఇప్పుడు ఫ్రాన్స్‌కు చెందిన లుసిల్లే రెండన్ (సిస్టర్ ఆండ్రే) ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా గుర్తింపు పొందనున్నారు. ప్రస్తుతం ఆమె వయస్సు 118 సంవత్సరాల 73 రోజులు. కెన్ తనకా విషయానికొస్తే.. జనవరి 2, 1903న నైరుతి జపాన్‌లోని ఫుకుయోకా ప్రాంతంలో జన్మించారు. అదే సంవత్సరంలో, రైట్ సోదరులు వారి సొంత విమానంలో మొదటిసారి ప్రయాణించారు. కాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌తోనే ఇటీవల తనకా పుట్టినరోజును జరుపుకున్నారు కెన్‌. ఆమె తన యుక్త వయసులో ఎన్నో వ్యాపారాలు నిర్వహించి బిజినెస్‌ ఉమన్‌గా గుర్తింపుపొందారు. అందులో నూడిల్ షాప్, రైస్ కేక్ స్టోర్ కూడా ఉన్నాయి. కాగా కేన్‌ మార్చి 2019 లో 116 సంవత్సరాల వయస్సులో ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కారు. సెప్టెంబర్ 2020లో, ఆమెను 117 సంవత్సరాల 261 రోజుల వయస్సులో జపాన్‌లో అత్యంత వృద్ధురాలిగా గుర్తింపుపొందారు.

19 ఏళ్ల వయస్సులో వివాహం..

కాగా తొమ్మిది మంది తోబుట్టువులలో ఏడవ సంతానం తనకా. 19 సంవత్సరాల వయస్సులో 1922లో హిడియో తనకాను వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఐదవ బిడ్డను దత్తత తీసుకున్నారు. కాగా కొన్నిరోజుల క్రితం తనకా తన దీర్ఘాయుష్షు రహస్యాన్ని పంచుకున్నారు. సోడా,చాక్లెట్లతో సహా రుచికరమైన ఆహారాన్ని తినడం అలాగే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడం తన దీర్ఘాయుష్షు రహస్యం అని ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. కాగా తనకా మరణంతో ఫ్రాన్స్‌కు చెందిన లుసిల్లే రెండన్ (సిస్టర్ ఆండ్రే) ఇప్పుడు అత్యంత పెద్ద వయస్కురాలిగా ఉన్నారు. ఆమె 1904 ఫిబ్రవరి 11న దక్షిణ ఫ్రాన్స్‌లో జన్మించింది. ఆమె టౌలాన్‌లోని ఓ వృద్ధాశ్రమంలో నివసిస్తోంది.