Gachwaha Community: హిందూ సంప్రదాయంలో భర్త ఆయుష్షు కోసం భార్యలు రకరకాల పూజలు, వ్రతాలు, నోములు చేస్తారు. అతడు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు. కానీ ఒక ప్రదేశంలో భర్త ఆయుష్షు కోసం భార్యలు వితంతువులుగా జీవిస్తారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని గచ్వాహా తెగకు చెందిన మహిళలు భర్తల కోసం ఐదు నెలలు వితంతువులుగా బతుకుతారు. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వీరి ఆచారాలు, సంప్రదాయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హిందూ సంప్రదాయం ప్రకారం స్త్రీలు అలంకార ప్రియులు. భర్త చనిపోతే మాత్రం దూరంగా ఉంటారు. అయితే గచ్వాహా సంఘానికి చెందిన మహిళలు భర్త బతికుండగానే అలంకారానికి దూరంగా ఉంటారు. ఈ మహిళలు అలంకరించుకోవడం అశుభంగా భావిస్తారు. తాళిబొట్టు, పూలు, గాజులు వేసుకోరు. తెల్ల చీరలు మాత్రమే ధరిస్తారు. వింత సంప్రదాయలను అనుసరిస్తూ వితంతువుగా జీవిస్తారు. ఇలా ప్రతి సంవత్సరం ఐదు నెలల పాటు ఉంటారు. ఇలా చేస్తే వారి భర్త ఆయుష్షు పెరుగుతుందని వారి గట్టి నమ్మకం.ఈ సంప్రదాయం ఇక్కడ చాలా కాలంగా కొనసాగుతోంది.
దీనిని మహిళలందరు అనుసరిస్తారు. ఇందులో పాల్గొన్న మహిళలు 5 నెలల పాటు ఎలాంటి మేకప్ చేయరు. ఈ 5 నెలల్లో వారి భర్తలు చెట్ల మీద నుంచి కల్లు తీయడానికి వెళుతారు. అప్పటి వరకు స్త్రీలు సాదాసీదా జీవితాన్ని గడుపుతారు.ఈ కమ్యూనిటీ ప్రజలు తార్కులహా దేవిని కులదైవంగా పూజిస్తారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో నివసించే ఈ కమ్యూనిటీ ప్రజల జీవనోపాధి కల్లు గీయడం. అయితే తాటి చెట్లు చాలా పొడవుగా, నిటారుగా ఉంటాయి అందువల్ల అవి ఎక్కేటప్పుడు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి భార్యలు కులదేవి పాదాల వద్ద తమ అలంకరణను ఉంచుతారు. భర్త దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. ఇలా చేస్తే కులదేవి వారిని కాపాడుతుందని నమ్మకం.