
ఒక అమెరికన్ మహిళ ప్రసవానికి కొన్ని రోజుల ముందు తాను గర్భవతి అని తెలుసుకుంది. ఆశ్చర్యకరంగా శిశువు ఆమె ఉదరం లోపల, గర్భాశయంలో కాకుండా ఒక తిత్తిలో పెరుగుతోంది వైద్యులు గుర్తించారు. కాలిఫోర్నియాలోని బేకర్స్‌ఫీల్డ్‌కు చెందిన 41 ఏళ్ల నర్సు సూజ్ లోపెజ్‌కు చాలా కాలంగా పెద్ద అండాశయ తిత్తి ఉంది. ఈక్రమంలోనే ఆమె కడుపు నెమ్మదిగా పెరగడం ప్రారంభించింది. ఆమె అది తిత్తి అని భావించింది. ఆమెకు వాంతులు కాలేదు, వికారం అనిపించలేదు. శిశువు కదలికలు కూడా ఏమాత్రం తెలియలేదు. ఆమెకు ఋతు చక్రం ఇప్పటికే సక్రమంగా లేదు. కాబట్టి, పీరియడ్స్ రాకపోవడం మామూలే అనుకుంది. నెలల తరబడి ఆమె తన భర్తతో సాధారణ జీవితాన్ని గడిపింది. విదేశాలకు కూడా ప్రయాణించింది. కానీ, ఒక రోజు తీవ్రమైన కడుపు నొప్పి, ఒత్తిడి పెరిగింది. దీంతో ఆమె తిత్తిని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించింది.
తిత్తిని తొలగించేందుకు గానూ డాక్టర్స్ ఆమెకు అన్ని టెస్ట్‌లు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆమెకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె, ఆమె భర్త ఇద్దరూ షాక్ అయ్యారు. స్కాన్‌లో గర్భాశయం పూర్తిగా ఖాళీగా ఉండటం కనిపించింది. కానీ, ఆమె ఉదరం లోపల దాదాపు పూర్తిగా అభివృద్ధి చెందిన శిశువు ఉంది. అది కటి గోడకు అత్తుకుని ఉందని వైద్యులు గుర్తించారు.
వైద్యుల అభిప్రాయం ప్రకారం, గర్భాశయం వెలుపల గర్భం దాల్చడం చాలా ప్రమాదకరం. అలాంటి సందర్భాలలో తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని చెప్పారు. ఉదరంలో అభివృద్ధి చెందుతున్న గర్భాలు చాలా అరుదు. అలాంటి శిశువు పూర్తి తొమ్మిది నెలలు ఉండటం దాదాపు అసాధ్యం అంటున్నారు. వైద్య చరిత్రలో ఈ కేసు అత్యంత అరుదైనది వైద్యులు వెల్లడించారు.
ఆగస్టు 18న, వైద్యుల బృందం ఎంతగానో శ్రమించి ఆమెకు ఆపరేషన్ చేశారు. 22 పౌండ్ల బరువున్న తిత్తితో పాటు కడుపులోని బిడ్డను సురక్షితంగా బయటకు తీశారు. సర్జరీ సమయంలో సూజ్ చాలా రక్తాన్ని కోల్పోయింది. కానీ సకాలంలో రక్త మార్పిడి ఆమె ప్రాణాలను కాపాడింది. ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చునని వైద్యులు చెప్పిన సూచన మేరకు ఆమె భర్త, సహా కుటుంబ సభ్యులంతా దేవుడిపై భారం వేసి ఎదురు చూశారు. గంటల తరబడి వైద్యులు పడిన శ్రమకు ఫలితం దక్కింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. 8 పౌండ్ల బరువున్న ఆ బిడ్డకు ర్యు అని పేరు పెట్టారు. ఈ బిడ్డ తమ జీవితంలో అతిపెద్ద వరం అని కుటుంబం చెబుతోంది. సూజ్ లోపెజ్ తాను అద్భుతాలను నమ్ముతానని, ఈ బిడ్డ దేవుని అత్యంత విలువైన బహుమతి అని చెబుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..