బాస్ డబ్బుతో లగ్జరీ లైఫ్.. రూ. కోట్లు కొట్టేసిన కిలేడీ! ఇంట్లో కళ్లు చెదిరే వస్తువులు!
ఉద్యోగం ఇచ్చిన బాస్‌కు నమ్మకంగా ఉండాల్సిన మహిళ చివరకు ఆయన బ్యాంక్ ఖాతానే తన వ్యక్తిగత ఏటీఎంలా మార్చుకుంది. ఖరీదైన షాపింగ్ చేయాలన్నా, ప్రైవేట్ జెట్‌లో విహారయాత్రకు వెళ్లాలన్నా, కొత్త వాహనం కొనాలన్నా ఆమెకు పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే ఆ ఖర్చులన్నీ భరించడానికి బాస్ డబ్బు ఉంది కదా! ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.170 కోట్లు కాజేసింది. ఆ డబ్బుతో లూయిస్ విట్టన్ బ్యాగులు, రోలెక్స్ వాచీలు, ఖరీదైన బూట్లు కొనుగోలు చేసింది. చివరకు ఇంట్లో అధికారులు తనిఖీలు చేయడంతో ఆమె సాగించిన విలాసాల బాగోతం బయటపడింది.

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన 47 ఏళ్ల లిజ్‌బెత్ షెర్మన్ ఓ రిటైర్డ్ వెంచర్ క్యాపిటలిస్ట్ వద్ద పనిచేసేది. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాకు చెందిన ఆ వ్యాపారవేత్తకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డు బిల్లులు, ఇతర ఆర్థిక లావాదేవీలను ఆమె పర్యవేక్షించేది. యజమాని ఆమెపై ఎంతో నమ్మకం ఉంచి కీలకమైన బాధ్యతలు అప్పగించారు.
కానీ ఆమె మాత్రం ఆ నమ్మకాన్ని అడ్డుపెట్టుకుని భారీ మోసానికి తెరతీసింది. యజమాని క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించాల్సిన డబ్బును తన వ్యక్తిగత క్రెడిట్ కార్డు బిల్లుల కోసం మళ్లించడం మొదలుపెట్టింది. ఇలా సెప్టెంబర్ 2015 నుంచి మే 2025 వరకు దాదాపు పదేళ్ల పాటు ఈ వ్యవహారాన్ని కొనసాగించింది.
ప్రతి నెలా వేలాది డాలర్లు తన వ్యక్తిగత ఖాతాల చెల్లింపులకు ఉపయోగించుకుంది. లగ్జరీ షాపింగ్, ఖరీదైన పర్యటనలు, ప్రైవేట్ జెట్ ప్రయాణాలు, వాహనాల కొనుగోలు.. ఇలా తనకు నచ్చిన ప్రతిదానికీ బాస్ డబ్బునే ఖర్చు చేసింది. అంతేకాదు.. సుమారు 2 మిలియన్ డాలర్ల విలువైన తన ఇంటి మరమ్మతులు, ఆధునికీకరణకు కూడా యజమాని సొమ్మునే ఉపయోగించింది.
ఇంట్లో తనిఖీలు చేస్తే షాక్.. 1,500కు పైగా ఖరీదైన వస్తువులు!
ఆమె సాగించిన విలాసవంతమైన జీవితం బాగోతం 2025 డిసెంబర్‌లో బయటపడింది. అధికారులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా అక్కడ కనిపించిన వస్తువులు చూసి ఆశ్చర్యపోయారు. ఇంట్లో ఏకంగా 1,500కు పైగా ఖరీదైన లగ్జరీ వస్తువులు ఉన్నట్లు గుర్తించారు.
ప్రపంచ ప్రఖ్యాత లూయిస్ విట్టన్ బ్రాండ్‌కు చెందిన ఖరీదైన హ్యాండ్‌బ్యాగులు, రోలెక్స్ వాచీలు, క్రిస్టియన్ లూబౌటిన్ బూట్లు.. ఇలా ఒక్కో వస్తువు ధర లక్షల్లో ఉండేలా కనిపించింది. ఒక ప్రత్యేకమైన అల్మారాలో వరుసగా అమర్చిన డిజైనర్ హ్యాండ్‌బ్యాగులు అధికారుల దృష్టిని ఆకర్షించాయి.
మరో చోట డజన్ల కొద్దీ ఖరీదైన క్రిస్టియన్ లూబౌటిన్ బూట్లు కనిపించాయి. అరుదైన జంతువుల చర్మాలతో తయారు చేసిన బ్యాగులను ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా క్యాబినెట్ కూడా ఏర్పాటు చేసుకుంది. వీటితో పాటు ఖరీదైన వైన్ బాటిళ్లు, ఇతర డిజైనర్ వస్తువులను కూడా గుర్తించారు.
ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ వస్తువుల్లో చాలా వరకు అసలు ప్యాకింగ్ కూడా తీయలేదు. కొనుగోలు చేసినప్పుడు ఉన్న ధరల ట్యాగులు సైతం అలాగే ఉన్నాయి. అంటే వాటిని ఉపయోగించడం కంటే ఇంట్లో సేకరించి పెట్టుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.
కొనడమే కాదు.. ఆన్‌లైన్‌లో అమ్మకాలు కూడా!
షెర్మన్ ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడంతోనే ఆగిపోలేదు. వాటిలో కొన్నింటిని ఆన్‌లైన్ రీసేల్ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయించడం మొదలుపెట్టింది. ఇలా కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా 4.5 లక్షల డాలర్లకు పైగా సంపాదించింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.4 కోట్లకు పైమాటే! ఒకవైపు యజమాని డబ్బుతో లగ్జరీ వస్తువులు కొనుగోలు చేస్తూ.. మరోవైపు వాటిలో కొన్నింటిని ఆన్‌లైన్‌లో అమ్మి అదనపు ఆదాయం పొందింది. ఈ వ్యవహారం ఆమె విలాసాల స్థాయిని మాత్రమే కాకుండా, మోసం ఎంతకాలం కొనసాగిందో కూడా స్పష్టం చేస్తోంది.
నేరం అంగీకారం.. 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం!
దాదాపు రూ.170 కోట్ల మోసానికి పాల్పడిన షెర్మన్‌పై అమెరికా అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆమె ఫెడరల్ వైర్ ఫ్రాడ్ నేరాన్ని అంగీకరించింది. ఒప్పందంలో భాగంగా తన మాజీ యజమానికి దాదాపు 18 మిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కేసులో 2027 మార్చి 22న ఆమెకు శిక్ష ఖరారు కానుంది. నేర తీవ్రతను బట్టి గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఆమెకు ఎలాంటి శిక్ష విధించాలనేది న్యాయస్థానం నిర్ణయించనుంది.
ఒక ఉద్యోగికి యజమాని ఇచ్చిన బాధ్యత ఎంత కీలకమైందో ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ ఘటన తెలియచేసింది. పదేళ్ల పాటు సాగిన రూ.170 కోట్ల మోసం ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.