Viral News: బీడీలు చేస్తూ చిల్లర జమ చేశాడు.. సంచి నిండా 2 రూపాయల నాణేలతో షోరూంకి వెళ్లాడు..

|

Jul 16, 2022 | 7:47 AM

ఒక వ్యక్తి గత ఆరేళ్లుగా చిల్లర నాణేలు జమ చేస్తూ వస్తున్నాడు.. అన్ని రెండు రూపాయల కాయిన్సే.. అవి మొత్తం రూ.1.8 లక్షలు జమయ్యాయి.

Viral News: బీడీలు చేస్తూ చిల్లర జమ చేశాడు.. సంచి నిండా 2 రూపాయల నాణేలతో షోరూంకి వెళ్లాడు..
Bengal Trader
Follow us on

Trending: ఒక వ్యక్తి గత ఆరేళ్లుగా చిల్లర నాణేలు జమ చేస్తూ వస్తున్నాడు.. అన్ని రెండు రూపాయల కాయిన్సే.. అవి మొత్తం రూ.1.8 లక్షలు జమయ్యాయి. ఆరేళ్లకాలంగా సేకరించి జాగ్రత్తగా దాచుకున్న ఆ కాయిన్స్‌ చెల్లించి అతడు బైక్‌ కొనుగోలు చేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నడియా జిల్లాలో జరిగింది. 46 ఏళ్ల సుబ్రతా సర్కార్ బీడీలు తయారు చేసి షాపులకు అమ్ముతుంటాడు. 2016 నవంబర్‌లో నాటి రూ.500, రూ.1000 పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో నగదు కొరత వల్ల అప్పుడు చాలా వరకు చిల్లర లావాదేవీలు జరిగాయి. ఈ నేపథ్యంలో బీడీల వ్యాపారి అయిన సుబ్రతాకు షాపుల వాళ్లు నాణేల రూపంలో చెల్లించేవారు. అయితే భవిష్యత్తులో దేనికైనా అవసరం రావచ్చని భావించిన ఆయన నాటి నుంచి కొంత చిల్లరను దాచాడు. దీంతో అవి బస్తాల మేరకు ఇంట్లో పేరుకుపోయాయి. ఆ చిల్లర మూటల్లో ఎక్కువగా రెండు రూపాయిల నాణేలు ఉన్నాయి.

కాగా, సుబ్రతా సర్కార్ గత నెల ఒక బైక్‌ షోరూమ్‌ మీదుగా వెళ్తుండగా, ఆ నాణేలతో బైక్‌ ఎందుకు కొనకూడదు అన్న ఆలోచన వచ్చింది. చదువుకుంటున్న 17 ఏళ్ల కుమారుడు శేఖర్‌కు ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో ఆరేళ్లుగా పోగు చేసిన నాణేలను లెక్కించగా అవి రూ.1.8 లక్షలుగా తేలాయి. శేఖర్‌ ఇటీవల ఆ బైక్‌ షోరూమ్‌ డీలర్‌ను సంప్రదించాడు. నాణేలతో బైక్‌ కొనుగోలు చేస్తామని చెప్పాడు. దీనికి ఆ యజమాని ఒప్పుకున్నాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు చిల్లర నాణేలను లెక్కించి మూటలు కట్టారు. రూ.10,000 చొప్పున ఐదు బ్యాగుల్లో, మిగతా చిల్లరను మరో రెండు గోనె సంచుల్లో మూటకట్టారు. మంగళవారం ఆ చిల్లర బస్తాలను ఆటోలో బైక్‌ షోరూమ్‌కు తీసుకెళ్లారు. అయితే ఆ చిల్లరను లెక్కించేందుకు ఐదుగురు సిబ్బందికి మూడు రోజుల సమయం పట్టింది. శుక్రవారంతో లెక్కింపు పూర్తయింది. దీంతో శేఖర్‌కు బైక్‌ కీ, పత్రాలు అందజేశారు. రూ.1.5 లక్షలను నాణెల్లో చెల్లించారని షోరూమ్‌ మేనేజర్‌ ప్రబీర్ బిస్వాస్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి