ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు ప్రతిరోజూ కొత్త జాతుల జంతువులను కనుగొంటారు. కానీ నేటికీ, ఈ భూమిపై ఎన్ని రకాల జీవులు ఉన్నాయో చెప్పేందుకు ఎటువంటి ఖచ్చితమైన డేటా లేదు. ఈ క్రమంలోనే పరిశోధకులు మరో అరుదైన సముద్రపు జీవిని గుర్తించారు. నీలి రంగులో ఉన్న అరుదైన సముద్రపు ఎండ్రకాయను గుర్తించిన శాస్త్రవేత్తలు దానికి ‘బ్లూ లోబ్‌స్టర్’ అని నామకరణం చేశారు. ఈ నీలిరంగు ఎండ్రకాయను బ్రిటన్‌లోని దక్షిణ కార్నిష్ తీరంలో గుర్తించారు. దీని అరుదైన రంగు, ఆకారం కారణంగా వార్తల్లో నిలిచింది.
సమాచారం ప్రకారం.. ఈ ప్రత్యేకమైన సముద్ర జీవిని క్రిస్ ప్యూక్ అనే మత్స్యకారుడు పట్టుకున్నాడు. తమ పడవ 15 నుంచి 18 అడుగుల లోతైన ప్రాంతంలో ఉండగా, తన వలలో ఈ నీలిరంగు ఎండ్రకాయ కనిపించిందని చెప్పారు. దాన్ని బయటకు తీయగానే దాని రంగు చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. తాను గత 11 సంవత్సరాలుగా చేపల వేట సాగిస్తున్నానని, కానీ ఇంతకు ముందు ఇలాంటి నీటి రంగు ఎండ్రకాయను ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు మత్స్యకారుడు. గోధుమ లేదా ఎరుపు ఎండ్రకాయలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయని, అయితే ఇది అన్నింటికంటే అరుదైనదిగా చెప్పాడు.
ఈ ఎండ్రకాయల రంగు ఎలక్ట్రిక్ బ్లూ, జన్యు క్రమరాహిత్యం కారణంగా ఇలాంటి అరుదైన రంగు ఏర్పడుతుందని పరిశోధకులు అంటున్నారు. దీని కారణంగా ఒక నిర్దిష్ట ప్రోటీన్ వాటి శరీరంలో పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేయబడటం ప్రారంభమవుతుంది. సుమారుగా 20 లక్షల్లో ఒకరికి మాత్రమే ఇలాంటి అరుదైన బ్లూ ఎండ్రకాయను పట్టుకునే అవకాశం లభిస్తుందని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని జీవశాస్త్ర విభాగానికి చెందిన నిపుణులు తెలిపారు.
ప్రస్తుతం, ఆ అరుదైన ‘బ్లూ లోబ్‌స్టర్’ భద్రత కోసం, దానిని అక్వేరియంకు విరాళంగా అందజేశారు. ఎందుకంటే.. దీనిని తిరిగి దాని సహజ నివాస స్థలం సముద్రంలో వదిలేస్తే..మళ్ళీ అది మరో వలలో చిక్కుకుపోతుందేమో లేదా ఇంకేదైనా ఇతర సముద్ర జీవులు తినేస్తాయని సదరు మత్య్స్యకారుడు ఆందోళన వ్యక్తం చేశాడు. అందువల్ల ఈ ఎండ్రకాయలను అక్వేరియంలో ఉంచారు. తద్వారా ఇది వేటాడే జంతువుల నుండి సురక్షితంగా ఉంటుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..