వీకెండ్ కావడంతో ఓ వ్యక్తి.. బట్టలను వాషింగ్ మెషిన్‌లో వేసేందుకు సిద్దమయ్యాడు. బట్టలన్నీ దానిలో వేసి.. స్విచ్ ఆన్ చేశాడు. ఎంతసేపటికీ అది ఆన్ కాదే..? ఇంక చేసేదేమి లేక దగ్గరలో ఉన్న ఓ మెకానిక్‌ను ఇంటికి పిలిచాడు. అతడు వచ్చి వాషింగ్ మెషిన్‌ను పరిశీలించి రిపేరు చేయడం మొదలు పెట్టాడు.. సీన్ కట్ చేస్తే భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. స్థానికంగా భయందోళన చెలరేగింది. అసలు సంగతి తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పూణేలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న భవానీపేట ప్రాంతంలోని బీ-వింగ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోన్న ఓ వ్యక్తి.. వీకెండ్ కావడంతో వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేసేందుకు సిద్దమయ్యాడు. బట్టలు వేసినప్పటికీ ఎంతసేపైనా వాషింగ్ మెషిన్ ఆన్ కాకపోవడంతో స్థానికంగా ఉండే ఓ మెకానిక్‌కు కబురు పెట్టాడు. అతడు వచ్చి వాషింగ్ మెషిన్‌ను చెక్ చేస్తుండగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవిస్తుంది. వెంటనే ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళే కాదు.. మెకానిక్ సైతం భయపడి.. బయటికి పరుగులు తీశారు.
స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వారు బాంబ్ స్క్వాడ్‌తో అక్కడికి చేరుకొని పేలుడు సంభవించిన అపార్ట్‌మెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. అంతేకాదు విచారణ నిమిత్తం పోలీసులు అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తిని పీఎస్‌కు తీసుకెళ్లారు.