
వర్జిన్ ఆస్ట్రేలియా విమానం నుండి ఒక వింత వార్త వైరల్ అవుతోంది. బాలి నుంచి బ్రిస్భేన్‌కు వెళ్తున్న విమానం గాల్లో ఉన్న సమయంలో టాయిలెట్లలో సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికులు నీళ్ల బాటిళ్లలో ముత్ర విసర్జన చేయాల్సిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానంలో టాయిలెట్ పనిచేయకపోవడంతో ప్రయాణికులు బాటిళ్లలో మూత్ర విసర్జన చేయాల్సి రావడంతో ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సంఘటన గత వారం బాలి (ఇండోనేషియా) నుండి బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా) కు వస్తున్న విమానంలో జరిగింది.
ఈ విమానం బోయింగ్ 737 మాక్స్ 8 విమానంతో నడపబడింది. గురువారం మధ్యాహ్నం వర్జిన్ ఆస్ట్రేలియా బోయింగ్ విమానం బాలిలోని డెన్‌పసర్ విమానాశ్రయం నుంచి బ్రిస్బేన్‌కు బయల్దేరింది. ఈ క్రమంలో టాయిలెట్లలో సమస్య తలెత్తడంతో నీళ్ల బాటిళ్లలో మూత్ర విసర్జన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. విమానం బయలుదేరే సమయానికి, మరమ్మతుల కారణంగా వెనుక టాయిలెట్ ఇప్పటికే మూసివేయబడింది. కానీ ప్రయాణంలో మిగిలిన టాయిలెట్లు కూడా చెడిపోయాయి. దీని కారణంగా 6 గంటల విమానం ప్రయాణంలో ప్రయాణీకులకు టాయిలెట్ సౌకర్యాలు లభించలేదు.
విమానంలో జరిగిన ఈ సంఘటనపై ప్రయాణికులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సమయంలో గత మూడు గంటలు చాలా కష్టంగా గడిచాయని ఒక ప్రయాణీకుడు చెప్పాడు. కొంతమంది సీసాలలో మూత్ర విసర్జన చేయాల్సి వచ్చింది. చాలా మంది ప్రయాణికులు వాసన, అసౌకర్యంతో ఇబ్బంది పడ్డారు.
ఇదిలా ఉంటే ఒక వృద్ధ మహిళ పరిస్థితి మరీ దారుణంగా మారింది. తనను తాను నియంత్రించుకోలేక బహిరంగంగా మూత్ర విసర్జన చేసేసింది. విమానం 3వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో అన్ని టాయిలెట్లు పనిచేయడం మానేశాయని మరో ప్రయాణీకుడు చెప్పాడు. మిగిలిన సమయంలో మమ్మల్ని బాటిల్‌లో లేదా ఇప్పటికే మురికిగా ఉన్న టాయిలెట్‌లో మూత్ర విసర్జన చేయమని చెప్పారు. ఇది అవమానకరమైనది అంటూ ప్రయాణికులు మండిపడ్డారు.
చివరకు జరిగిన ఘటనపై వర్జిన్ ఆస్ట్రేలియా క్షమాపణలు చెప్పింది. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, బాధిత ప్రజలకు విమాన టికెట్ డబ్బులు క్రెడిట్ ఇవ్వబడుతుందని తెలిపింది. ఈ క్లిష్ట పరిస్థితిని నిర్వహించడానికి ప్రయత్నించిన తమ సిబ్బందిని కూడా ఎయిర్‌లైన్ ప్రశంసించింది. ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఈ సంఘటనను విమర్శించింది. ఇది ప్రయాణీకులు, సిబ్బందికి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదం అని పేర్కొంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..