
ఈ సంవత్సంర నైరుతి రుతుపవనాలు ముందే వచ్చేశాయి. షెడ్యూల్ కన్నా వారం ముందే వర్షాలు మొదలయ్యాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో రుతుపవనాలు తెలుగురాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లు వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు, పశుపక్ష్యాదులకు వర్షాలతో కాస్త ఉపశమనం కలిగించినా ఇబ్బందులూ తప్పడంలేదు.
వర్షాలకు పుట్టల్లోనుంచి పాములు బయటకు వస్తున్నాయి. ఇళ్లలో, దుకాణాల్లో, వాహనాల్లో ఎక్కడపడితే అక్కడ చేరుతున్నాయి. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటీవలే కోళ్లకు మేత వేద్దామని వెళ్లిన వ్యక్తిని త్రాచుపాము బుసలు కొడుతూ పరుగులు పెట్టించింది. తాజాగా నిర్మల్ జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది.
నిర్మల్ జిల్లా ఎన్టీఆర్ మార్గంలోని ఓ దుకాణంలోకి ఏకంగా రెండు భారీ పాములు చేరాయి. ఎప్పటిలాగే షాపు క్లోజ్ చేసి వెళ్లిన యజమాని మర్నాడు వచ్చి షాపు ఓపెన్ చేయగానే లోపలనుంచి ఏవో వింత శబ్ధాలు, కదలికలను గుర్తించాడు. ఏమై ఉంటుందా అని పరిశీలించిన అతనికి ఒళ్లగగుర్పొడిచే విధంగా రెండు భారీ పాములు దుకాణంలో ఓ చోట చుట్టు చుట్టుకొని కనిపించాయి. దెబ్బకు గుండెజారినంత పనైంది అతనికి.
వెంటనే దుకాణం నుంచి బయటకు పరుగెత్తాడు. ఒక్కక్షణం ఆగి.. స్నేక్ క్యాచర్ షేక్ యాసిన్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా పాములను పట్టుకున్నాడు. సుమారు 10 అడుగుల పొడవైన ఆ రెండు పాములను సంచిలో వేసుకొని తీసుకెళ్లి సురక్షితంగా అడవిలో వదిలిపెట్టాడు. దీంతో షాపు యజమాని, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.