
సాధారణంగా కాలేజీల్లో జరిగే ఫంక్షన్లలో విద్యార్థులు డ్యాన్సులు చేస్తూ అలరిస్తారు. కొన్నిసార్లు లెక్చరర్లు కూడా వారితోపాటు కాలు కదిపి ఉత్సాహం నింపుతారు. కానీ, ఈ కాలేజీలో మాత్రం ఓ మహిళా లెక్చరర్ ఓ బాలీవుడ్ సినిమా పాటకు దుమ్మురేపే డ్యాన్స్ చేసింది. విద్యార్థులు అరుపులు కేకల మధ్య స్టైలీష్ స్టెప్పులతో స్టేజీని ఊపేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్‌లోని ఓ కాలేజీ ఫంక్షన్‌కు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట మంట పుట్టిస్తోంది. ఆ వీడియోలో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమాలోని ఓ పాటకు ఆమె డ్యాన్స్ చేసింది.
ఈ వైరల్ వీడియోలో.. చీర ధరించిన ఒక ఉపాధ్యాయురాలు వేదికపై అదిరే స్టెప్పులు వేసి అలరించారు. ఆమె నృత్య కదలికలు, ఆత్మవిశ్వాసం ఒక ప్రొఫెషనల్ నృత్యకారిణి కంటే తక్కువేం కాదన్నట్లగా ఉన్నాయి. “ధురంధర్” చిత్రంలోని సూపర్ హిట్ ట్రాక్ “తేను శరరత్ సిఖావన్”కి ఆమె నృత్యం చేయడం ప్రారంభించిన వెంటనే.. హాల్ మొత్తం అరుపులు, కేకలు, చప్పట్లు, ఈలలతో మారుమోగింది.
కాగా ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 3.3 మిలియన్లకు పైగా వీక్షించారు. 2,37,000 మందికి పైగా లైక్ చేశారు. ఆ మహిళా లెక్చరర్ డ్యాన్స్ ప్రదర్శనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.