కెనడాలోని నోవా స్కోటియాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే 220 టన్నుల బరువున్న ఓ భారీ భవనాన్ని సబ్బు కడ్డీల సాయంతో ఒకచోట నుంచి మరో చోటికి మార్చారు. అవును మీరు సరిగ్గా చదివారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. భవనాన్ని తరలిస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ వీడియో చూసిన ప్రజలు షాక్ అయ్యారు.
హాలిఫాక్స్‌లోని ఈ భవనం 1826 సంవత్సరంలో నిర్మించారు. తరువాత దీనిని విక్టోరియన్ ఎల్మ్‌వుడ్ హోటల్‌గా మార్చారు. ఈ భవనాన్ని కూల్చివేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే రియల్ ఎస్టేట్ కంపెనీ గెలాక్సీ ప్రాపర్టీస్ ఈ భవనాన్ని కొత్త ప్రదేశానికి తరలించే ప్రణాళికతో హోటల్‌ను కొనుగోలు చేసింది. దీంతో భవన కూల్చివేత నుండి కాపాడింది. అయితే ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు మొత్తం భవనాన్ని తరలించిన విధానం నిజంగా అందరికి ఆశ్చర్యం కలిగించింది.
మీడియా కథనాల ప్రకారం ఎస్. రష్టన్ కన్స్ట్రక్షన్ సంస్థ బృందం దాదాపు 700 సబ్బుల సహాయంతో హోటల్‌ను కొత్త ప్రదేశానికి తరలించారు. భవనం చాలా మృదువుగా ఉన్నందున రోలర్లను ఉపయోగించకుండా స్టీల్ ఫ్రేమ్‌పైకి ఎక్కించడానికి ఐవరీ సబ్బును ఉపయోగించాలని నిర్ణయించినట్లు కంపెనీ యజమాని షెల్డన్ రష్టన్ చెప్పారు.
భవనం మార్చుతున్న టైమ్‌లాప్స్ వీడియోను నిర్మాణ సంస్థ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో హోటల్‌ను సబ్బుల సహాయంతో 30 అడుగుల దూరం తరలించినట్లు చూపబడింది. కొత్త పునాది రెడీ అయిన తర్వాత ఈ భవనాన్ని తరలించారు. సమీప భవిష్యత్తులో ఈ చారిత్రాత్మక భవనాన్ని సంరక్షించడానికి, పునరుద్ధరించడానికి తాము చేసిన చర్యలు ఉపయోగిబడతాయని షెల్డన్ చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..