చెప్పులోని రాయి.. చెవిలోని జోరీగ కాంతిలో నలుసు పెట్టె బాధ గురించి ఎంత చెప్పినా తక్కువే అని అన్నారు పెద్దలు.. అవును ఇంద్రియాల్లో కళ్లు అతి సున్నితమైనవి. కంటిలో చిన్న దుమ్ము పడినా సరే ఇబ్బంది పడటం.. నొప్పితో కంటి నుంచి నీరు కారుతూనే ఉంటుంది. కంటిలో నలుసుని తీసివేసే వరకూ ఉపశమనం లభించదు. అయితే వైద్యులను సైతం ఆశ్చర్యపరిచే ఓ ఉదంతం అమెరికాలో వెలుగుచూసింది. ఓ వ్యక్తి కంటి చెకప్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు అతని కంటిలో చెక్క ముక్క అతుక్కుపోయిందని.. అది కూడా 15 ఏళ్లకు పైగానే ఉందని దర్యాప్తులో తేలింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ వ్యక్తి ఎప్పుడూ నొప్పిని ఫీల్ కాలేదు.
nypost ప్రకారం ఈ షాకింగ్ కేసు బోస్టన్‌లో వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వ్యక్తికి మధుమేహం ఉంది. ఈ వ్యాధితో బాధపడేవారు కంటి సంబంధిత సమస్యలతో బాధపడతారు. కనుక తమ కళ్లను ఎప్పటికప్పుడు వైద్యుల వద్ద పరీక్షించుకోవాలి. ఈ వ్యక్తి కంటి వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు అతనిని పరీక్షించిన డాక్టర్ ఆశ్చర్యపోయాడు. అప్పుడు పేషేంట్ ని డాక్టర్ నీకు కంటి చూపు ఏ విధంగా ఉంది అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమీ ఇబ్బంది లేదని సమాధానం ఇచ్చాడు. అప్పుడు నీ కంటిలో 3 మిల్లీమీటర్ల పొడవైన చెక్క ముక్క చిక్కుకుందని డాక్టర్ చెప్పారు.
మొదట అంతా నార్మల్‌గానే ఉందని భావించిన డాక్టర్.. ఆ వ్యక్తి కార్నియాను పరిశీలించగా.. అక్కడ చెక్క ముక్క కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పుడు ఆ వ్యక్తి 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు. తోటపని చేస్తున్నప్పుడు తన కంటికి గాయమైందని చెప్పాడు. అప్పుడు చాలా బాధ కలిగింది. అయితే స్వతహాగా కోలుకున్నాక వైద్యులను సంప్రదించలేదని చెప్పాడు.
కంటి గాయానికి సంబంధించిన చాలా కేసుల్లో సమస్యను వెంటనే గుర్తించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. అయితే లక్షణాలు కనిపించని సందర్భాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. బోస్టన్‌కు చెందిన ఈ వ్యక్తి విషయంలో కూడా అలాంటిదే జరిగింది. అతని కంటిలో చెక్క ముక్క ఇరుక్కుపోయింది. కానీ ఎప్పుడూ కంటిలో నొప్పి అనిపించలేదు.. అసౌకర్యంగా ఫీల్ కాలేదు. దీంతో కంటికి చికిత్స తీసుకోవాలని అనుకోలేదు.
అదృష్టవశాత్తూ.. చెక్క ముక్క ఆ వ్యక్తి కార్నియాకు తగలలేదు. లేదంటే అతను తన కంటి చూపును కోల్పోయే వాడు అని డాక్టర్ చెప్పారు. సమీప భవిష్యత్తులో అతని కంటిలో ఏదైనా నొప్పి లేదా సమస్య ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలని సూచించారు. అయితే చెక్క ముక్క బయటకు వచ్చిందో లేదో వైద్యులు చెప్పలేదు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..