వంట ఇంటిలోని పోపుల పెట్టే ఔషధాల గని.. వెల్లుల్లి లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. వెల్లుల్లిని ఆహరం తయారీలో మాత్రమే కాదు ఆయుర్వేదంలో కూడా మందుల తయారీకి ఉపయోగిస్తారు. అయితే మన దేశంలో పండించే వెల్లుల్లికి విదేశాల్లో కూడా మంచి ఆదరణ దక్కుతోంది. మరో వైపు దేశీయంగా వెల్లుల్లి ధర రాకెట్ వేగంగా పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో కిలో వెల్లుల్లి రూ. 600 దాటింది కూడా… ప్రస్తుతం గార్లిక్ కబాబ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. వెల్లుల్లి ధర మాత్రం అమాంతం పెరిగిపోయింది. దీంతో వెల్లుల్లి పండించే రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. అంతేకాదు తమ పంటను కాపాడుకునేందుకు చర్యలు కూడా మొదలు పెట్టారు.
సాధారణంగా ఇళ్లు, ఆఫీసులు, షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. అయితే ఇప్పుడు ఓ రైతు తన పొలంలో సీసీ కెమెరాను అమర్చాడు. మధ్యప్రదేశ్‌లోని చింద్‌వాడ జిల్లా మొహ్‌ఖేద్ ప్రాంతంలోని ఐదారు గ్రామాల పొలాల్లోని వెల్లుల్లి పంటను చోరీ చేశారు. ఈ ఘటనలు వెలుగులోకి రావడంతో మరికొందరు రైతులు ముందు జాగ్రత్తగా తమ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
“ఈ కెమెరాలు సౌరశక్తితో పనిచేస్తాయి… ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అలారం మోగిస్తాయి. కెమెరాలు అమర్చిన తర్వాత దొంగతనాలు తగ్గాయి’’ అని రాహుల్ దేశ్‌ముఖ్ అనే రైతు తెలిపారు. గత 60 ఏళ్లలో వెల్లుల్లి ధర ఇంతగా పెరగలేదు. అయితే ఇప్పుడు ధనవంతులైనా సరే వెల్లుల్లిపాయలు సాగు చేసిన రైతులు తమ పంటలు దోచుకుంటాయనే భయంతో ఉన్నారు.
2023లో వెల్లుల్లికి మంచి ధర లభించకపోవడంతో చాలా మంది రైతులు వెల్లుల్లి సాగును వదులుకున్నారు. దీంతో ఈ ఏడాది వెల్లుల్లి ధర అమాంతంగా పెరిగిందని చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..