న్యూయార్క్‌లో ఓ యువతి 54వ అంతస్తు నుంచి దూకబోతుండగా.. కొందరు పోలీసులు హీరోల్లా ప్రవేశించి ఆమె ప్రాణాలు కాపాడారు. డ్రమటిక్‌గా మహిళ ప్రాణాలు పోలీసులు రక్షించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు పోలీసుల నిబద్ధతకు, దైర్య సాహసాలకు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళను రక్షించిన విధానం సినిమా స్టంట్ కంటే తక్కువేం కాదని కామెంట్ సెక్షన్‌లో కామెంట్లు పెడుతున్నారు.
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. గత బుధవారం 33 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతో మాన్‌హాటన్ ప్రాంతంలోని 54 అంతస్తుల భవనంపైకి ఎక్కింది. గమనించిన కొందరు వ్యక్తులు ఎమర్జెన్సీ యూనిట్ (ఈఎస్‌యూ)కి తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మహిళ భవనం పై నుంచి దూకేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాల్ వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో పోలీసులపై అమర్చిన బాడీక్యామ్ నుంచి రికార్డ్ అయ్యింది. భవనంపైకి ఎక్కిన మహిళను రక్షించేందుకు పోలీసులు తమ ప్రాణాలను ఎలా పణంగా పెట్టి కాపాడారో వీడియో క్లిప్‌లో చూడవచ్చు. మహిళ వద్దకు వెళ్లేందుకు పోలీసు అధికారులు భవనం అద్దాల గోడ ఎక్కి 54వ అంతస్తులో ఉన్న ఆమెను చేరుకోవడం వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత ఓ స్లిట్ ఓపెనింగ్ ద్వారా ఇద్దరు పోలీసులు మహిళ పడిపోకుండా ఆమె ఎడమ చేతిని పట్టుకోవడం వీడియోలో కనిపిస్తుంది.
When the public needs help, they call the police. When the police need help, they call ESU. @NYPDSpecialops ESU detectives recently saved a distraught woman on a rooftop 54-stories up using their rope rescue skills.
Watch the body-worn-camera footage of the rescue⬇️ pic.twitter.com/mQrg5o3M8M
— NYPD NEWS (@NYPDnews) May 6, 2024
ఆ తర్వాత తాడుతో కట్టిన ఇద్దరు పోలీసులు గాజు గోడ దాటి అవతలకు వెళ్లి మహిళను సురక్షితంగా ఇవతలకు తీసుకొస్తారు. అనంతరం పోలీసధికారులు కూడా గోడ దూకి సురక్షితంగా లోనికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన రెస్క్యూ వీడియోను న్యూయార్క్ పోలీసులు ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ప్రజలకు సహాయం అవసరమైనప్పుడు, వారు పోలీసులకు కాల్ చేస్తారు. కానీ పోలీసులకు సహాయం అవసరమైనప్పుడు, వారు ESUకి కాల్ చేస్తారంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేసన్ వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.