బైక్ లు, కార్లతో స్టంట్లు చేయడం మాములే. కానీ వీటిని రోడ్డుపై వాహనాదారులను ఇబ్బంది పెట్టకుండా ప్రత్యేక స్థలాల్లో చేయాలి. కాని మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 23 ఏళ్ల వ్యక్తి రాత్రిపూట లగ్జరీ కారుతో స్టంట్ చేసి వాహనాదారులను కంగారు పెట్టాడు. ఆ కారుని రోడ్డు మధ్యలోకి తీసుకొచ్చి వేగంగా రౌండ్లు తిప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కొంతమంది ఈ వీడియోను ట్రాఫిక్ పోలీసులకు పంపించారు. దీనిపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు ఆ వ్యక్తి పై కేసు నమోదు చేశారు. వాహనాదారులను ఇబ్బందులకు గురిచేసేలా ప్రమాదకరంగా స్టంట్ చేసినందుకు ఆ కారును సీజ్ చేశారు. అలాగే అతని లైసెన్సు ను మూడు నెలల పాటు రద్దు చేశారు. ఇటువంటి ప్రమాదకరమైన స్టంట్లు రోడ్డుపై చేయడం వల్ల డ్రైవర్ ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుందని తెలిపారు.