తల లేకపోయినా బ్రతికేస్తాయి.. 20 కోట్ల ఏళ్ల క్రితమే భూమిపైకి.. బొద్దింకల గురించి ఇవి తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఇంట్లో బొద్దింక కనిపిస్తే చాలు.. కొంతమంది భయంతో కేకలు పెడతారు, మరికొంతమంది చిరాగ్గా చంపేస్తుంటారు. ఈ జీవి తల లేకున్నా బతుకుతుంది. ఆహారం లేకుండా నెల రోజులు, నీరు లేకుండా వారం రోజులు బ్రతికేసే ఈ కీటకాల గురించి అసలు విషయాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

ప్రతి ఇంట్లో ముఖ్యంగా కిచెన్, బాత్రూమ్‌లలో తిరుగుతూ మహిళలకు చిరాకు తెప్పించే బొద్దింకల గురించి చాలా మందికి చాలా తక్కువ విషయాలు తెలుసు. కొంతమంది అయితే వీటిని చూడగానే భయపడితే.. మరికొందరు వారి భరతం పట్టేవరకు వదిలిపెట్టరు. అయితే బొద్దింక గురించిన కొన్ని నమ్మలేని నిజాలు తెలిస్తే మాత్రం మీరు ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఈ జీవి వెనుక కోట్లాది సంవత్సరాల హిస్టరీ ఉంది. సాధారణంగా మనం చూసే బొద్దింకలు భూమిపై జీవిస్తున్న అత్యంత పురాతన కీటకాలలో ఒకటి. శాస్త్రవేత్తల నివేదికల ప్రకారం.. ఇవి దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం లేదా అంతకంటే ముందు నుంచే భూమిపై నివసిస్తున్నాయి. అంటే డైనోసార్ల కాలం నాటి నుండి ఇవి మనుగడ సాగిస్తూ వస్తున్నాయి. ఒక సాధారణ బొద్దింక జీవితకాలం సుమారు ఒక సంవత్సరం ఉంటుంది.
తల లేకపోయినా బ్రతికేస్తాయి
బొద్దింకలకు సంబంధించిన అత్యంత విచిత్రమైన నిజం ఏంటంటే.. వీటి తల నరికేసినా కూడా వారం రోజుల పాటు ఇవి సులభంగా జీవించగలవు. ఎందుకంటే ఇవి మనలాగా ముక్కు లేదా నోటితో శ్వాస తీసుకోవు. వీటి శరీరంలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాసిస్తాయి. తల తెగిపోయిన తర్వాత కూడా ఇవి చనిపోవడానికి కారణం శ్వాస అందక కాదు.. కేవలం నీరు, ఆహారం తీసుకోలేక మాత్రమే..
బొద్దింకల గురించి కొన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
శ్వాసను బిగపట్టడంలో కింగ్స్: బొద్దింకలు నీటిలో పడినా చనిపోవు. ఇవి దాదాపు 40 నిమిషాల పాటు తమ శ్వాసను బిగపట్టి నీటిలోనూ బ్రతకగలవు.
హుస్సేన్ బోల్ట్ వేగం: ఇవి పరిగెత్తడం మొదలుపెడితే గంటకు 3 మైళ్ల (సుమారు 4.8 కిలోమీటర్లు) వేగంతో దూసుకుపోతాయి.
నైట్ రైడర్స్: వీటికి చీకటి అంటే మహా ఇష్టం. పగటిపూట పైపులు, గోడల పగుళ్లు, తేమగా ఉండే మూలల్లో దాక్కుని, రాత్రి అవ్వగానే బయటకు వస్తాయి.
సిక్స్త్ సెన్స్: వీటి కాళ్లపై ఉండే ప్రత్యేకమైన స్పర్శ రోమాల ద్వారా గాలి పీడనంలో వచ్చే మార్పులను కనిపెడతాయి. కేవలం 0.05 సెకన్లలోనే ప్రమాదాన్ని గ్రహించి అక్కడ నుండి మాయమైపోతాయి.
ఆకలిని తట్టుకుంటాయి కానీ: ఆహారం లేకుండా ఇవి ఒక నెల రోజుల వరకు జీవించగలవు. కానీ, నీరు లేకుండా మాత్రం ఒక వారం కంటే ఎక్కువ రోజులు బ్రతకలేవు.
ఏదైనా తినేస్తాయి: బొద్దింకలు కేవలం అన్నం మెతుకులే కాదు.. జిగురు, గ్రీజు, సబ్బు, గోడల రంగు, తోలు, పుస్తకాల అట్టలు, చివరికి మనుషుల జుట్టును కూడా తినేయగలవు.
మీకు తెలుసా..?
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,000 కంటే ఎక్కువ బొద్దింకల జాతులు ఉన్నాయి. కానీ ఊరట కలిగించే విషయం ఏంటంటే, అందులో కేవలం 30 జాతులు మాత్రమే మనుషులు నివసించే ఇళ్లలోకి వస్తాయి. ఏది ఏమైనా కోట్లాది సంవత్సరాలుగా ప్రకృతిలో వస్తున్న మార్పులన్నింటినీ తట్టుకుని నిలబడిన ఈ జీవుల సర్వైవల్ స్కిల్స్ మాత్రం అద్భుతం అని చెప్పక తప్పదు.
