సాధారణంగా ఎవరైనా కొబ్బరి బొండం తాగాలంటే కత్తి తీసుకుని దాని మొదలును కట్ చేసి ఆపై రంధ్రం చేసి కొబ్బరి నీళ్లు తాగుతారు. కానీ ఓ చిలుక మాత్రం డైరెక్ట్‌గా చెట్టుకు ఉన్న కొబ్బరి బొండాన్ని తెంచి చాలా సింపుల్‌గా అందులోని నీళ్లని పీల్చేసింది. ఈ రంగుల చిలుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం గుడిచర్ల గ్రామంలోని ఓ రైతు పొలంలోని కొబ్బరి చెట్టుపై ఈ వెరైటీ చిలుక చేసిన సందడి అంతా ఇంతా కాదు. అయితే ఆ చిలుకకు దాహమైందో ఏమో తెలియదు కానీ… కొబ్బరి చెట్టుపై కూర్చొని ఓ కొబ్బరి బొండం తెంపి.. ఆపై దాని పొడవాటి ముక్కుతో బొండం తొలిచేస్తూ.. చాలా సులువుగా పైకెత్తి అందులోని నీటిని గుటగుటా తాగేసింది. ఈ వీడియో పాతదే అయినప్పటికీ తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే నీలం, పసుపు రంగులు కలిగివున్న ఆ చిలుక చూడ్డానికి కాస్త వింతగా ఉంది. ఇదిలావుంటే ప్రస్తుతం మానవాళి జీవనంలో యాంత్రికంగా మార్పులు సంభవించడంతో అనేక జీవరాశులు వాటి మనుగడను కోల్పోతున్నాయి. ఒకప్పుడు మన వద్ద బాగా కనిపించిన చిలుకలు.. ఇప్పుడు అరుదుగా మాత్రమే తారసపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇటువంటివి ఒకరకంగా మనసుకు చాలా ఆశ్చర్యాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. ప్రస్తుతం ఈ చిలుక విన్యాసాలను చూసిన నెటిజన్లు వీడియోను షేర్ చేస్తూ..లైక్‌లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
Also Read: జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. తెలంగాణ సర్కార్ నిర్ణయం