ప్రకృతిలో పువ్వులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందంగా .. ఆహ్లాద కరంగా సువాసనలను వెదజల్లుతూ ఆకట్టుకుంటాయి. ఇంద్ర ధనుస్సుని తలపించే పువ్వులకు గురించి ఎంత చెప్పినా తక్కువే. జాజి, మల్లి, సంపెంగ వంటి అనేక పువ్వులు తమ సువాసనలతో ప్రసిద్ధి చెందాయి. అయితే ఒక పువ్వు దుర్వాసనతో ప్రపంచ ప్రసిద్ధిగాంచింది అని మీకు తెలుసా..
ఈ పువ్వు పేరు రఫ్లేసియా. దట్టమైన అడవుల్లో ఈ మొక్క పెరుగుతుందని.. వికసించే ఈ పువ్వు కుళ్లిపోయిన శవంలా వాసన వస్తుందట. ఎంతగా అంటే.. ఈ మొక్క నుంచి వీలైనంత దూరం పారిపోవాలని పించేటంత దుర్వాసన వస్తుందట. అందుకే ఈ పుష్పాన్ని ‘శవాల పువ్వు’ అని కూడా పిలుస్తారు. మీరు ఈ పువ్వు సమీపంలో కనీసం ఒక్క నిమిషం కూడా ఉండలేరు. దుర్వాసనతో కూడిన ఈ పువ్వు శతాబ్దాలుగా వృక్షశాస్త్రజ్ఞులను ఆకర్షిస్తోంది. అనేక పరిశోధనలకు నిలయంగా మారింది. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ పువ్వు గురించి ఓ షాకింగ్ విషయం వెల్లడించారు. రఫ్లేసియా ప్రస్తుతం ప్రమాదం అంచున నిలబడిందని.. అంతరించిపోతున్న మొక్కల్లో ఒకటిగా నిలుస్తుందని హెచ్చరిస్తున్నారు. కావున ప్రకృతిలో అరుదైన జాతి కనుక దీనిని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రఫ్లేసియా పువ్వులు కుళ్ళిన మాంసం వాసన వెదజల్లుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ పువ్వు మాంసాహారి. ఈగలను ఆకర్షించి ఆహారంగా తీసుకుంటుంది.
ది గార్డియన్ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 42 రకాల రఫ్లేసియా జాతులు ఉన్నాయి. అయితే ఈ అన్నిరకాల జాతులు ప్రమాదం అంచున ఉన్నాయని పరిశోధకులు హెచ్చరించారు. అంతరించిపోతున్న జాతులను వర్గీకరించారు కూడా.. వీటిలో 25 జాతులు దాదాపు కనుమరుగయ్యే స్టేజ్ లో ఉండగా.. 15 జాతులు మధ్యస్థంగా అంతరించిపోతున్నాయని వెల్లడించారు.
ఆక్స్‌ఫర్డ్ బొటానికల్ గార్డెన్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ క్రిస్ థొరోగుడ్ మాట్లాడుతూ.. రఫ్లేసియా ఒక పరాన్నజీవి మొక్క. దీనికి ఆకులు, కాండం లేదా వేర్లు ఉండవు. అంతేకాదు ఈ మొక్కలో కిరణజన్య సంయోగక్రియ జరగదు. బ్రూనై, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ , థాయిలాండ్ అడవులలో ఈ పువ్వులు తరచుగా కనిపిస్తాయి. నివేదికల ప్రకారం ప్రపంచంలోని అత్యంత దుర్వాసనగల ఈ పువ్వును 18వ శతాబ్దం చివరిలో యూరోపియన్ అన్వేషకులు మొదటిసారిగా కనుగొన్నారు. అప్పటి నుండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఈ పువ్వుపై నిరంతరం పరిశోధన చేస్తూనే ఉన్నారు. దీని ఉనికిని కాపాడడానికి ప్రయత్నిస్తునే ఉన్నారు.
పొద్దుతిరుగుడు పువ్వులా కనిపించే ఈ పువ్వు పూయడానికి చాలా నెలలు పడుతుంది. ఇది అక్టోబర్ నుండి వికసించడం ప్రారంభించి వచ్చే ఏడాది మార్చిలో పూర్తిగా వికసిస్తుంది. సంవత్సరం క్రితం ఈ పువ్వు ఇండోనేషియా అడవులలో కూడా కనుగొనబడింది. ఇది దాదాపు 4 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఆ సమయంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పించే పువ్వుగా పరిగణించబడింది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..