AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీ ధైర్యానికో దండం అక్కా.. 60 వేల పాములతో అదిరిపోయే దందా.. లక్షలు కాదు కోట్లే..

సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరుగెడతాం. అలాంటిది వేల సంఖ్యలో ఉన్న అత్యంత భయంకరమైన నాగుపాములు, పిట్ వైపర్ల మధ్య ఓ మహిళ నివసిస్తోంది. ఆమెకు అవి కేవలం పాములు మాత్రమే కాదు.. ఏటా కోట్లు తెచ్చిపెట్టే బంగారు బాతులు.. చైనాకు చెందిన ఈ మహిళ ప్రాణాలకు తెగించి చేస్తున్న ఈ విషపూరిత వ్యాపారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

నీ ధైర్యానికో దండం అక్కా.. 60 వేల పాములతో అదిరిపోయే దందా.. లక్షలు కాదు కోట్లే..
Snake Farming Business
Krishna S
|

Updated on: Apr 20, 2026 | 5:53 PM

Share

ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి. కానీ, ఒక మహిళ ఎంచుకున్న మార్గం వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. బుసలు కొట్టే నాగుపాములు, అత్యంత విషపూరితమైన పిట్ వైపర్లు.. ఇవే ఆమె జీవనోపాధి. ప్రమాదంతో ప్రాణాల మీదకు వస్తుందని తెలిసినా, పట్టువదలకుండా పోరాడి నేడు ఏడాదికి కోట్లాది రూపాయలు సంపాదిస్తూ వార్తల్లో నిలుస్తోంది గ్వాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన క్విన్. చైనాకు చెందిన క్విన్ అనే మహిళ ఒకప్పుడు సాధారణ ఉద్యోగం చేసేది. కానీ ఏదైనా కొత్తగా చేయాలనే తపనతో తన ఉద్యోగాన్ని వదిలేసి పాముల పెంపకం వైపు మొగ్గు చూపింది. మొదట్లో ఆమె తల్లిదండ్రులు ఈ ప్రమాదకర నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఆమె పట్టుదల చూసి చివరకు ఆమె తండ్రి కూడా తోడయ్యారు. ప్రస్తుతం ఆమె వద్ద 60,000 పైగా విషపూరిత పాములు ఉన్నాయి. ఇందులో 10,000 నాగుపాములతో పాటు అత్యంత ప్రమాదకరమైన పిట్ వైపర్లు, ఐదు దశల పాములు ఉన్నాయి.

ఏటా రూ.1.34 కోట్ల సంపాదన ఎలా..?

పాముల వ్యాపారం అంటే కేవలం వాటిని అమ్మడం మాత్రమే కాదు. పాములోని ప్రతి భాగం ఆర్థికంగా ఎంతో విలువైనదని క్విన్ వివరిస్తున్నారు. నాణ్యతను బట్టి పాము విషం గ్రాముకు 6 నుండి 30 డాలర్ల వరకు పలుకుతుంది. ఐదు దశల పాములు నెలకు రెండుసార్లు విషాన్ని ఇస్తాయి. పాము చర్మాన్ని ఎండబెట్టి సాంప్రదాయ చైనా వైద్యంలో ఉపయోగిస్తారు. అలాగే పాము పిత్తాశయాలు, పాము నూనెకు వైద్య రంగంలో భారీ డిమాండ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పాము మాంసం ధర ఊహించలేనంత ఎక్కువగా ఉంటుంది. ఒక పెద్ద పాము ధర సుమారు రూ.11 లక్షలు వరకు ఉంటుందని సమాచారం. అన్ని ఖర్చులు పోను, ఈ వ్యాపారం ద్వారా ఆమె ఏటా సుమారు రూ.1.34 కోట్లు ఆర్జిస్తోంది.

భయం లేని సాహసం.. కానీ జాగ్రత్త తప్పనిసరి

పాములకు ఆహారం అందించడం, వాటి నుండి విషాన్ని సేకరించడం అత్యంత ప్రమాదకరమైన పని. ‘‘మా నాన్న ఈ పని చేయడం చూస్తూ పెరిగాను, అందుకే నాకు భయం లేదు’’ అని క్విన్ చెబుతోంది. అయితే పాము కాటు వేయదు అని చెప్పడం అబద్ధమని, ఒకసారి విషపూరిత పాము కరిస్తే ఆ నొప్పి శరీరమంతా పాకి నరకం చూపిస్తుందని ఆమె హెచ్చరిస్తోంది. తన సాహసాలను ప్రపంచానికి చూపించడానికి క్విన్ ది గర్ల్ హూ కలెక్ట్స్ స్నేక్ వెనమ్ అనే యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నడుపుతోంది. వేలాది మంది ఫాలోవర్లు ఆమె పాములతో చేసే విన్యాసాలను, విషాన్ని సేకరించే పద్ధతులను ఆసక్తిగా గమనిస్తుంటారు.

The Girl Who Collects Snake Venom

కాగా ప్రమాదకరమైన మార్గమైనా, సరైన అవగాహన మరియు పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని క్విన్ నిరూపిస్తోంది. అయితే, ఇది కేవలం నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే సాధ్యమయ్యే వ్యాపారం అని గుర్తుంచుకోవాలి.

Follow Us