Viral: అన్ని రోజులూ మనవి కావు.. ప్రాణం పోసిన పాములే ఊపిరి తీశాయి.. విషనాగు కాటుకు కుప్పకూలిన స్నేక్‌మ్యాన్‌

|

Sep 14, 2022 | 5:32 PM

Snake Man: అందరికీ పాములంటే భయం. కనిపిస్తే ఆమడదూరం పారిపోతారు. కానీ అతను మాత్రం పాములతో ఆడుకుంటాడు. ఎవరైనా పాములకు హాని కలగజేయాలని చూస్తే సర్దిజెబుతాడు. వాటిని సురక్షితంగా వదిలిపెడతాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 ఏళ్ల పాటు పాములు పడుతున్నాడు

Viral: అన్ని రోజులూ మనవి కావు.. ప్రాణం పోసిన పాములే ఊపిరి తీశాయి.. విషనాగు కాటుకు కుప్పకూలిన స్నేక్‌మ్యాన్‌
Snake Man Vinod
Follow us on

Snake Man: అందరికీ పాములంటే భయం. కనిపిస్తే ఆమడదూరం పారిపోతారు. కానీ అతను మాత్రం పాములతో ఆడుకుంటాడు. ఎవరైనా పాములకు హాని కలగజేయాలని చూస్తే సర్దిజెబుతాడు. వాటిని సురక్షితంగా వదిలిపెడతాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 ఏళ్ల పాటు పాములు పడుతున్నాడు. జిల్లాలో ఏ ఇంట్లో పాము దూరినా పట్టేసి అడవిలో వదిలి పెడతాడు. అలాంటి వ్యక్తి చివరకు పాము కాటుతోనే ప్రాణాలొదిలాడు. రాజస్థాన్‌ చురు జిల్లాకు చెందిన వినోద్‌ తివారీ(45) గురించే ఇదంతా. జిల్లాలో సుమారు 20 ఏళ్లుగా పాములు పడుతున్న ఆయనకు స్నేక్‌ మ్యాన్‌గా మంచి గుర్తింపు ఉంది. ఎలాంటి పాములనైనా ఆయన సులభంగా పట్టేయగలడు. ఈనేపథ్యంలో గోగమెడి ప్రాంతంలో జనావాసాల్లోకి ప్రవేశించిన ఓ నాగుపామును పట్టేశాడు. అయితే దానిని పట్టుకునే క్రమంలో అది వేలిని కాటేసింది.

గతంలోనూ పాము కాట్ల బారిన పడ్డాడు వినోద్‌. సత్వర చికిత్స తీసుకుని క్షేమంగా బయటపడ్డాడు. అయితే ఈసారి మాత్రం పాము కాటును తేలికగా తీసుకున్నాడు. ముందు పామును అడవిలో వదిలిరావాలనుకున్నాడు. ఆతర్వాతే ట్రీట్‌మెంట్‌కు వెళ్లాలని భావించాడు. అనుకున్నట్లుగానే పామును సంచిలో వేసుకుని కాస్త ముందుకు వెళ్లగానే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే గమనించి వినోద్‌ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే లాభం లేకుండా పోయింది. పాము కాటులో విషం మోతాదు అధికంగా ఉండడంతో ఆయన వెంటనే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని స్నేక్‌మ్యాన్‌కు నివాళి అర్పించారు. ఇదిలా ఉంటే వినోద్‌ ప్రాణాలను బలిగొన్న పాముకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరలవుతోంది. ఇందులో పామును పట్టుకునే సమయంలో అది కాటు వేయడం, స్నేక్‌ మ్యాన్‌ గాయపడడం, కొద్ది దూరం వెళ్లి కుప్పకూలడం మనం చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..