AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్‌ విమర్శకురాలు ఇల్హాన్‌ ఒమర్‌ ఇంట్లో ఫెడరల్‌ ఏజెంట్ల సోదాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను తరచూ విమర్శించే డెమోక్రటిక్‌ పార్టీ కాంగ్రెస్‌ సభ్యురాలు ఇల్హాన్‌ ఒమర్‌ ఇంట్లో ఫెడరల్‌ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. మిన్నెసోటా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ఇంట్లో సోమవారం ఈ తనిఖీలు జరిగాయి. ఈ చర్యను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించిన ఇల్హాన్‌ ఒమర్‌.. తన గొంతు నొక్కలేరని ఘాటుగా స్పందించారు.

ట్రంప్‌ విమర్శకురాలు ఇల్హాన్‌ ఒమర్‌ ఇంట్లో ఫెడరల్‌ ఏజెంట్ల సోదాలు
Raids On Us Lawmaker And Trump Critic Ilhan Omar
Sharada V
|

Updated on: Oct 15, 2026 | 12:55 PM

Share

తన ఇంట్లో సోదాలపై ఇల్హాన్‌ ఒమర్‌ సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించారు. ఫెడరల్‌ దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ‘గత పదేళ్లుగా నిరాధార ఆరోపణలు, తప్పుడు ప్రచారాలతో ట్రంప్‌ నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు జరుగుతుంది కూడా రాజకీయ బెదిరింపుల ప్రచారంలో భాగమే’ అన్నారు. ఇల్హాన్‌ ఒమర్‌ కుటుంబం ఇమ్మిగ్రేషన్‌ పత్రాలకు సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆరోపణలను ఒమర్‌ ఖండించారు.

ట్రంప్‌ ఏమన్నారు?

ఒమర్‌పై  గతంలో ట్రంప్‌ పలుమార్లు విమర్శలు చేశారు. సోమవారం ఒహాయోలో జరిగిన రాజకీయ సభలోనూ ఆమె సోమాలియా మూలాలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. అమెరికా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న ఆమె ప్రపంచంలోని అత్యంత అధ్వానమైన దేశాల్లో ఒకటైన సోమాలియా నుంచి వచ్చారని విమర్శించారు. దీనికి సభలోని కొందరు మద్దతుదారులు స్పందిస్తూ ‘బహిష్కరించండి’ అని నినాదాలు చేశారు.  ఒమర్‌ ఇంట్లో జరిగిన సోదాలతో తనకు సంబంధం లేదని ఈ వ్యవహారం న్యాయ శాఖ పరిధిలోనిది అని విలేకరులతో చెప్పారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ గతంలో ఒమర్‌పై ఇమ్మిగ్రేషన్‌ మోసానికి సంబంధించిన ఆరోపణలు చేశారు.

సోదాల వెనుక కారణమేంటి?

హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్‌ (HSI) అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో ఒమర్‌ ఇంటి బయట వీధిని అధికారులు మూసివేశారు. కొన్ని బాక్సులను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. వాషింగ్టన్‌ డీసీ ప్రాంతంలో కొనసాగుతున్న ఫెడరల్‌ క్రిమినల్‌ దర్యాప్తులో భాగంగానే.. న్యాయస్థానం అనుమతితో జారీ చేసిన సెర్చ్‌ వారెంట్‌ ఆధారంగా తనిఖీలు నిర్వహించినట్లు అమెరికా న్యాయ శాఖ స్పష్టం చేసింది.

ఎన్నికలకు ముందు సోదాలు.. డెమోక్రాట్ల ఆగ్రహం

మధ్యంతర ఎన్నికలకు మూడు వారాల ముందు కాంగ్రెస్‌ సభ్యురాలి ఇంట్లో సోదాలు జరపడాన్ని డెమోక్రాట్ నేతలు తప్పు పట్టారు.  ప్రతినిధుల సభలో డెమోక్రటిక్‌ పార్టీ మైనారిటీ నాయకుడు హకీమ్‌ జెఫ్రీస్‌తో పాటు ఇతర ముఖ్య నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ట్రంప్‌, ఆయనకు మద్దతు ఇచ్చే తీవ్రవాద భావజాలం ఉన్న వర్గాలు ఒమర్‌పై చాలా కాలంగా వ్యక్తిగత దాడులు, నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.

ఎవరీ ఇల్హాన్‌ ఒమర్‌?

ఇల్హాన్‌ ఒమర్‌ 2018లో తొలిసారి అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. మిన్నెసోటాలోని కాంగ్రెస్‌ నియోజకవర్గానికి  ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రగతిశీల భావజాలంతో పనిచేసే డెమోక్రటిక్‌ నేతల బృందం ‘ది స్క్వాడ్‌’లో ఆమె కీలక సభ్యురాలు. సోమాలియాలో అంతర్యుద్ధం కారణంగా తన కుటుంబం దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిందని ఒమర్‌ గతంలో తెలిపారు. తనకు ఎనిమిదేళ్ల వయసులో కుటుంబం కెన్యాలోని శరణార్థి శిబిరానికి వెళ్లిందని, అనంతరం 1990వ దశకంలో అమెరికాకు చేరుకున్నట్లు తెలిపారు. 1997లో తన కుటుంబం మిన్నియాపొలిస్‌కు మారిందని చెప్పారు.

అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ఇద్దరు ముస్లిం-అమెరికన్‌ మహిళల్లో ఒమర్‌ ఒకరు. అలాగే ఆఫ్రికా నుంచి శరణార్థిగా వచ్చి అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అయితే ఇజ్రాయెల్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలను కారణంగా చూపుతూ 2023లో రిపబ్లికన్లు ఆమెను ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి తొలగించేందుకు ఓటు వేశారు. ట్రంప్‌ మద్దతుదారుల నుంచి కూడా ఆమెకు తరచూ విమర్శలు ఎదురవుతున్నాయి.

గతంలోనూ ఇమ్మిగ్రేషన్‌ ఆరోపణలు

ఇల్హాన్‌ ఒమర్‌ తన సోదరుడినే వివాహం చేసుకుని ఇమ్మిగ్రేషన్‌ మోసానికి పాల్పడ్డారనీ ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని ఒమర్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ఏడాది జనవరిలో మిన్నియాపొలిస్‌లోని టౌన్‌హాల్‌ సమావేశంలో ఓ వ్యక్తి ఆమెపై వెనిగర్‌ ద్రవాన్ని చల్లాడు.  దాడికి పాల్పడిన వ్యక్తికి 14 నెలల జైలు శిక్ష విధించారు. తాజాగా ఎన్నికలకు ముందు ఫెడరల్‌ అధికారులు ఒమర్‌పై జరిపిన సోదాలతో అమెరికా రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది.

Follow Us