పిల్లల చేతికి డబ్బులు ఇస్తే ఏం చేస్తారు ఖర్చు పెడతారు. కిరాణా షాప్ వద్దకు వెళ్లి తమకు నచ్చిన తినుపదార్థాలు కొనుక్కుని తింటారు. చాలా కొద్ది మంది మాత్రమే ఆ డబ్బును జాగ్రత్తగా దాచుకుంటారు. అలాంటి కోవకు చెందినదే ఈ చిన్నారి. ప్రస్తుత కాలంలో వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్యుల జేబులపై విపరీతమైన ప్రభావం చూపుతోంది. దీని వల్ల ప్రజలు కనీస పొదుపు చేయలేకపోతున్నారు. ఇలాంటి కష్ట సమయాలు వస్తాయనే కొందరు తమ పొదుపు సొమ్మును భవిష్యత్ అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెట్టుబడి పెడుతుంటారు. తాజాగా లోక జ్ఞానమే సరిగా తెలియని ఆ చిన్నారి.. ఏకంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. అవును మీరు విన్నది నిజంగా నిజం. తన పాకెట్ మనీని పొదుపు చేసేందుకు సిద్ధమైంది.
చిన్నారి తన మనసులోని మాటను వెల్లడిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఈ వీడియోలో ఆ చిన్నారి మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా చక్కగా మాట్లాడుతోంది. చిన్న పిల్లలకు తమకు ఇచ్చిన డబ్బును చిరుతిళ్ల కోసం వినియోగించుకోవడం చూశాం గానీ, ఈ చిన్నారి మాత్రం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీపావళి రోజున తన పెద్దలు తనకు ఇచ్చిన పాకెట్ మనీని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడతానంటూ ప్రకటించింది.
స్వాతి దుగ్గర్ ఈ చిన్నారికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో 7 ఏళ్ల అమ్మాయి, ఆమె తల్లికి మధ్య సంభాషణ జరుగుతుంది. ఈ సందర్భంగా పాకెట్ మనీని ఏం చేస్తావ్? అని ప్రశ్నించగా.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతానని చెప్పింది. ఇక నుంచి తన పాకెట్ మనీని అంతా 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లు చిన్నారి చెప్పింది. అంతేకాదు, ఆ అమ్మాయికి మ్యూచువల్ ఫండ్స్‌పై మంచి అవగాహన ఉన్నట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. మ్యూచువల్ ఫండ్స్‌లో లాభాలు రాకపోవచ్చునని, ఒక్కోసారి పెట్టుబడిదారులు నష్టాన్ని కూడా భరించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పుకొచ్చింది చిన్నారి.
అయితే, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. ఈ వీడియోను చూసి ఫిదా అయిపోయారు పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ. చిన్నారి వీడియోను రీట్వీట్ చేశారు. ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం సరైనదేనని క్యాప్షన్ కూడా పెట్టారు విజయ్. చిన్నారి జ్ఞానానికి ఫిదా అయిన విజయ్.. ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు.
What my daughter intends to do with her Diwali Shagun envelops? pic.twitter.com/Edwg81ZUPH
— Swati Dugar (@SwatiDugar_) October 25, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..