దేశంలోని ఏ గుడిలో ఎక్కువ బంగారం ఉందో తెలుసా..? ధనిక ఆలయాలు ఇవే..

భారతదేశంలో ఆధ్యాత్మికతకు.. అపారమైన సంపదకు విడదీయరాని ముడి ఉంది. శతాబ్దాల నాటి మన పుణ్యక్షేత్రాలు కేవలం భక్తి కేంద్రాలు మాత్రమే కాదు.. కుబేరుడినే అబ్బురపరిచే అఖండ ఖజానాలు.. మరి దేశంలోనే అత్యంత ధనిక దేవాలయాలు ఏవి? ఆయా క్షేత్రాల్లో ఉన్న టన్నుల కొద్దీ బంగారు నిధుల వెనుక ఉన్న రహస్యాలు ఏంటి? అనేది తెలుసుకుందాం..

దేశంలోని ఏ గుడిలో ఎక్కువ బంగారం ఉందో తెలుసా..? ధనిక ఆలయాలు ఇవే..
Top 5 Richest Temples In India

Updated on: May 23, 2026 | 8:40 AM

దేశంలో ఆధ్యాత్మికతకు, సంస్కృతికి దేవాలయాలు నిలయాలు. అయితే ఇక్కడి కొన్ని పుణ్యక్షేత్రాలు కేవలం భక్తి పరంగానే కాకుండా.. వాటి వద్ద ఉన్న అపారమైన సంపద, టన్నుల కొద్దీ బంగారు నిధుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అబ్బురపరుస్తున్నాయి. హిందూ సంప్రదాయంలో బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా, శ్రేయస్సుకు చిహ్నంగా భావించి శతాబ్దాలుగా భక్తులు దేవుళ్లకు సమర్పిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యంత ధనిక దేవాలయాలు.. వాటి ఖజానాలో ఉన్న బంగారు నిధుల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

శ్రీ పద్మనాభస్వామి ఆలయం (కేరళ)

సంపద అనగానే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది కేరళ రాజధాని తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా ఇది గుర్తింపు పొందింది. ఈ ఆలయ రహస్య నేలమాళిగల్లో లభించిన నాణేలు, పురాతన ఆభరణాలు, రత్నాలు, విగ్రహాల రూపంలో సుమారు 1,500 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇక్కడి రహస్య గదులు తెరిచినప్పుడు బయటపడ్డ నిధుల విలువ సుమారు 1.2 ట్రిలియన్లకు (లక్షా 20 వేల కోట్ల రూపాయలకు పైగా) పైనే ఉంటుందని లెక్కగట్టారు. చారిత్రక ప్రాధాన్యతను కలిపితే దీని విలువ ఊహకు అందదు.

తిరుమల తిరుపతి దేవస్థానం

ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించే క్షేత్రాలలో ఒకటైన తిరుమల శ్రీవారి ఆలయం దేశంలోనే అత్యంత ధనిక దేవాలయాల జాబితాలో రెండవ స్థానంలో ఉంది. నివేదికల ప్రకారం, తిరుమల శ్రీవారి ఖజానాలో, వివిధ జాతీయ బ్యాంకులలో డిపాజిట్ చేసిన రూపంలో 10 టన్నులకు పైగా బంగా* ఉంది. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు సమర్పించే తలనీలాలు, హుండీ కానుకల ద్వారా ఏటా వందల కోట్ల ఆదాయం, వందల కిలోల బంగారం వేంకటేశ్వరస్వామికి లభిస్తుంది.

వెల్లూరు గోల్డెన్ టెంపుల్

తమిళనాడులోని వెల్లూరులో కొలువై ఉన్న లక్ష్మీ నారాయణి దేవాలయం దాని అద్భుతమైన వాస్తుశిల్పానికి, వైభవానికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది.ఈ పూర్తి దేవాలయ గోపురాలు, స్తంభాలు 1.5 టన్నుల స్వచ్ఛమైన బంగారు రేకులతో కప్పబడి ఉన్నాయి. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాల కాంతిలో ఈ స్వర్ణ దేవాలయం మెరిసిపోయే దృశ్యం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది.

షిర్డీ సాయిబాబా సంస్థాన్

మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయం దేశంలోనే అత్యంత ఎక్కువ విరాళాలు అందుకునే పుణ్యక్షేత్రాలలో ఒకటి. జాతి, మత బేధాలు లేకుండా కోట్ల మంది భక్తులు సాయిని దర్శించుకుంటారు. బాబా ఖజానాలో వందల కోట్ల విలువైన బంగారం, వెండి, నవరత్నాలు ఉన్నాయి. భక్తులు సమర్పించిన సింహాసనం, కిరీటాలు, హారాల రూపంలో ఇక్కడ భారీగా స్వర్ణ నిధులు ఉన్నాయి. ఏటా ఇక్కడికి వందల కోట్ల నగదు విరాళంగా వస్తుంది.

హర్మందిర్ సాహిబ్ – గోల్డెన్ టెంపుల్

అమృత్‌సర్‌లో ఉన్న పవిత్రమైన హర్మందిర్ సాహిబ్ క్షేత్రాన్ని ప్రపంచమంతా గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తుంది. ఈ ఆలయ పైభాగం, గుమ్మటాలు దాదాపు 500 కిలోల స్వచ్ఛమైన బంగారు పూతతో అలంకరించబడి ఉంటాయి. 19వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ ఈ బంగారు పూత పనులను ప్రారంభించారు. ఇక్కడికి కూడా ప్రతి సంవత్సరం దేశవిదేశాల నుండి కోట్ల రూపాయల విరాళాలు అందుతాయి.

భారతదేశంలోని ఈ దేవాలయాలు కేవలం భౌతికమైన బంగారం, వెండి సంపదతోనే కాదు.. శతాబ్దాలుగా కోట్లాది మంది ప్రజలు దాచుకున్న అపారమైన నమ్మకం, అచంచలమైన విశ్వాసంతో కూడా సుసంపన్నంగా విరాజిల్లుతున్నాయి.

Follow Us