500 ఏళ్ల రాజు సమాధి.. తలుపులు తెరవగానే 15మంది మృతి.. ఆ మిస్టరీ తెలిస్తే..

500 ఏళ్ల నాటి రాజు సమాధి తలుపులు తెరుచుకున్నాయి. రహస్యాలు బయటకొస్తాయనుకుంటే.. ఊహించని రీతిలో మృత్యువు పడగవిప్పింది. లోపలికి వెళ్లిన సైంటిస్టులు ఒకరి తర్వాత ఒకరు వరుసగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలాండ్ చరిత్రను కుదిపేసిన ఆ రాజా కాసిమిర్ IV శాపం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

500 ఏళ్ల రాజు సమాధి.. తలుపులు తెరవగానే 15మంది మృతి.. ఆ మిస్టరీ తెలిస్తే..
King Casimir Iv Tomb Opening Mystery

Updated on: Aug 01, 2026 | 11:17 AM

రాతి సమాధి తలుపులు తెరుచుకున్నాయి.. 500 ఏళ్లుగా నిద్రపోతున్న ఒక గొప్ప రాజు అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఆ వెలుగుతో పాటే ఒక అజ్ఞాత మృత్యువు కూడా బయటకు అడుగుపెడుతుందని అక్కడ ఉన్న పరిశోధకులు ఊహించలేకపోయారు. ఇజిప్ట్ మమ్మీల శాపం గురించి వినే ఉంటాం. కానీ సరిగ్గా అలాంటి ఘటనే 1970ల కాలంలో పోలాండ్‌ను పట్టి కుదిపేసింది. అది 1973 వ సంవత్సరం. పోలాండ్‌లోని జాతీయ మీడియాలో ఒక వార్త తీవ్ర సంచలనం సృష్టించింది. 15వ శతాబ్దానికి చెందిన పోలాండ్ గొప్ప చక్రవర్తి రాజా కాసిమిర్ IV జగికెలోన్ సమాధిని తెరిచేందుకు పురావస్తు శాఖకు ప్రత్యేక అనుమతి లభించింది. 1492లో మరణించిన ఈ రాజు, దాదాపు 500 ఏళ్లుగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆయన సమాధిలోని చారిత్రక ఆధారాలు, బంగారు ఆభరణాలు, ఆనాటి రహస్యాలను బయటకు తీయడమే లక్ష్యంగా సైంటిస్టులు, ఆర్కియాలజిస్టుల బృందం రంగంలోకి దిగింది.

మృత్యువు పడగ… ఒకరి తర్వాత ఒకరు..

సమాధి తెరిచిన కొన్ని రోజులకే అసలు భయం మొదలైంది. లోపలికి వెళ్లిన 12 మంది పరిశోధకుల్లో నలుగురు అతి తక్కువ సమయంలోనే వింత లక్షణాలతో అనుమానస్పదంగా ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వారాల్లోనే మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. ఆ తర్వాత రాజు మృతదేహం పరిశోధనల్లో తవ్వకాల్లో పాలుపంచుకున్న సైంటిస్టులు, కార్మికులతో కలిపి మొత్తం 15 మంది వరుసగా మరణించారు. ఈ ఘటనతో పోలాండ్ సమాజం ఒక్కసారిగా వణికిపోయింది. 1922లో ఈజిప్ట్‌లోని తుతన్ ఖామున్ సమాధిని తెరిచిన లార్డ్ కార్నర్వాన్ వింతగా మరణించినట్లే.. ఇది కూడా రాజా కాసిమిర్ శాపం అని, ఏదో అదృశ్య శక్తి వారిని బలితీసుకుందని ప్రజలు నమ్మడం ప్రారంభించారు.

శాపం కాదు… అది ప్రాణాంతక ఫంగస్..

15 మంది శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోవడంతో ఈ మరణాల వెనుక ఉన్న అసలు గుట్టు తేల్చేందుకు ప్రత్యేక పరిశోధనలు జరిపారు. శాస్త్రవేత్తలు తేల్చిన నిజం శాపాల కంటే అత్యంత దిగ్భ్రాంతికరంగా ఉంది. దాదాపు 500 ఏళ్ల పాటు గాలి, వెలుతురు లేని మూసివున్న ఆ సమాధిలో అత్యంత విషపూరితమైన ఫంగస్ విస్తరించి ఉంది. 1973లో సమాధి తలుపులు తెరవగానే, అక్కడి గాలిలో భయంకరమైన స్థాయిలో ఫంగస్ బీజాలు నిండిపోయాయి. పరీక్షల్లో ఆ సమాధిలో ఆస్పర్గిల్లస్, పెన్సిలియం రుబ్రమ్, పెన్సిలియం రుగులోసమ్ వంటి ప్రాణాంతక ఫంగస్‌లు అత్యధిక పరిమాణంలో ఉన్నట్లు తేలింది.

ఊపిరితిత్తుల్లోకి చేరిన సైలెంట్ కిల్లర్

సాధారణంగా ఈ ఫంగస్ అలెర్జీ లేదా తేలికపాటి జ్వరాన్ని మాత్రమే కలిగిస్తుంది. కానీ వందల ఏళ్ల పాటు గుహ లాంటి మూసివున్న ప్రదేశంలో రూపాంతరం చెందడం వల్ల ఇది సైలెంట్ కిల్లర్‌గా మారింది. మాస్క్‌లు లేకపోవడంతో లోపలికి వెళ్లిన సైంటిస్టులు పీల్చిన ఊపిరి ద్వారా ఈ విషపూరిత ఫంగస్ నేరుగా వారి ఊపిరితిత్తులలోకి, కడుపులోకి చేరింది. బలహీనమైన నిరోధక శక్తి ఉన్నవారి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ క్షణాల్లో వ్యాపించి, కొందరు కొన్ని రోజుల్లోనే చనిపోగా… మరికొందరు ఏడాది కాలంలో ప్రాణాలు కోల్పోయారు.

నేటి చరిత్రకు నేర్పిన పాఠం

2015లో జర్నల్ ఆఫ్ ది ఎయిర్ అండ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రచురించిన పరిశోధనా వ్యాసం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఆ సమాధిలోని ఫంగస్ స్థాయిలు మానవ శరీరానికి సురక్షితమైన పరిమితి కంటే వేల రెట్లు ఎక్కువగా ఉన్నాయని నిర్ధారించింది. ఈ పోలాండ్ ఘటన పురావస్తు రంగానికి ఒక పెద్ద కన్నువిప్పు అయింది. ఈ ఘటన తర్వాతే ప్రపంచంలో ఎక్కడైనా పురాతన సమాధులు, పిరమిడ్లు లేదా గుహలను తవ్వేటప్పుడు సైంటిస్టులు ప్రత్యేకమైన ఆక్సిజన్ మాస్క్‌లు, Hazmat సూట్లు, రక్షణ పరికరాలను తప్పనిసరిగా వాడటం ప్రారంభించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us