అబుజా, జూలై 25: గిన్నీస్ రికార్డు కోసం ఏకధాటిగా ఏడు రోజులు ఏడ్చి రికార్డు సృష్టించే ప్రయత్నంలో నైజీరియా యువకుడు కంటి చూపు కోల్పోయాడు. 93 గంటల 11 నిమిషాల పాటు క్రైయింగ్ మారథాన్‌తో నైజీరియాకు చెందిన టెంబు ఎబెరే గిన్నీస్ రికార్డు సృస్టించిన సంగతి తెలిసిందే. ఈ రికార్డు కోసం ఎబెరే ఏడు రోజులపాటు ఏకధాటికగా ఏడ్చి చివరికి కంటి చూపు కోల్పోయి నిజంగానే ఏడ్చేశాడు. తీవ్రమైన తలనొప్పితోపాటు రెండు కళ్లూ ఉబ్బిపోయి ముఖమంతా వాచిపోయి ఇబ్బంది పడ్డాడు. దాదాపు 45 నిముషాల పాటు అతను తాత్కాలికంగా కంటి చూపు కోల్పోయినట్లు ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలిపాడు.
26 ఏళ్ల ఎబెరే వారంపాటు నాన్‌స్టాప్‌గా ఏడవడానికి ప్రయత్నించి తాను తాత్కాలికంగా అంధత్వానికి గురైనట్లు ఇంటర్వ్యూలో తెలిపాడు. తిరిగి మామూలు మనిషిని కావడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చాడు. హైదరాబాద్‌లోని కామినేని హాస్పిటల్స్ సీనియర్ కంటి వైద్యుడు డాక్టర్ జయపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడు రోజుల పాటు నిరంతరం ఏడవడం వల్ల తాత్కాలికంగా కంటిచూపు కోల్పోయే అవకాశం ఉందన్నారు. అతిగా ఏడిస్తే శరీరంపైనా, కళ్లపైనా పలు రకాల దుష్ప్రభావాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. చిరాకు, అలసట, తలనొప్పి, శ్వాసకోస ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. కళ్లు అధికంగా కన్నీరు కోల్పోతే దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఐతే ఇది పూర్తి అంధత్వానికి దారితీయదని వివరించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.