
దొంగతనం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి బంగారం, నగలు లేదా గుట్టల కొద్దీ నగదు. కానీ అంతర్జాతీయ రిటైల్ సర్వేలు చెబుతున్న నిజాలు వింటే మీరు నోరెళ్లబెడతారు. ప్రపంచవ్యాప్తంగా దొంగల ప్రధాన లక్ష్యం ఖరీదైన ఆభరణాలు కాదు.. మనం రోజూ తినే జున్ను. అవును.. మీరు చదివింది నిజమే ప్రపంచంలో అత్యధికంగా దొంగిలించబడే వస్తువుల జాబితాలో చీజ్ అగ్రస్థానంలో నిలిచింది.
అంతర్జాతీయ రిటైల్ నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న మొత్తం చీజ్‌లో దాదాపు 4 శాతం దొంగతనానికి గురవుతోంది. ముఖ్యంగా ఐరోపా, అమెరికా వంటి దేశాల్లోని సూపర్ మార్కెట్లు, రిటైల్ దుకాణాల నుండి ఏటా లక్షల టన్నుల చీజ్ మాయమవుతోంది. దీని వల్ల వ్యాపారులకు ఏటా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది.
దొంగలు చీజ్‌ను ఎంచుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు:
అధిక ధర: కొన్ని రకాల లగ్జరీ చీజ్‌లు కిలో వేల రూపాయల ధర పలుకుతాయి.
చిన్న సైజు: వీటిని దుస్తుల్లో లేదా బ్యాగుల్లో దాచుకోవడం చాలా సులభం.
బ్లాక్ మార్కెట్ డిమాండ్: చీజ్‌కు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే దొంగిలించిన వస్తువును వెంటనే హోటళ్లకు లేదా చిన్న వ్యాపారులకు తక్కువ ధరకే అమ్మేయడం సులభం.
కేవలం చీజ్ మాత్రమే కాదు, సూపర్ మార్కెట్లలో దొంగల కన్ను పడే ఇతర వస్తువుల జాబితా కూడా పెద్దదే..
రెండవ స్థానం – మాంసం: ముఖ్యంగా ఖరీదైన స్టీక్స్, తాజా మాంసం ముక్కలు.
మూడవ స్థానం – చాక్లెట్: వీటిని కూడా దొంగిలించడం చాలా సులభం.
ఆల్కహాల్ – బేబీ ఫార్ములా: ఖరీదైన మద్యం సీసాలు, శిశువుల కోసం వాడే పౌడర్లు కూడా దొంగల జాబితాలో ఉన్నాయి.
సౌందర్య సాధనాలు: పర్ఫ్యూమ్‌లు, మేకప్ కిట్స్ వంటి చిన్న పరిమాణంలో ఉండే ఖరీదైన వస్తువులపై దొంగలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.
కాలం మారుతున్న కొద్దీ దొంగల అభిరుచులు కూడా మారుతున్నాయి. అందుకే ఇప్పుడు సూపర్ మార్కెట్లు పాలు, పండ్లు, జున్ను వంటి వస్తువుల దగ్గర కూడా సీసీ కెమెరాలతో పాటు యాంటీ థెఫ్ట్ ట్యాగ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.